మాదాపూర్ మత్తు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడు నవదీప్ (Navdeep) కు నోటీసులు జారీ అయ్యాయి. ఈనెల 23 తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు పోలీసులు. ఈ కేసులో ఏ-29 గా ఉన్నాడు నవదీప్.
ఈ కేసులో యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 8 మంది అరెస్ట్ అయ్యారు. కొందరు ప్రముఖులు పరారీలో ఉన్నారు. అలాగే, స్మాట్ పబ్ ఓనర్ సూర్య, షాడో సినిమా నిర్మాత రవి ఉప్పలపాటి, కలహర్ రెడ్డి, ఇంద్రాతేజ్, నవదీప్, శ్వేత, కార్తీక్ హైకోర్టు (High Court) ను ఆశ్రయించారు. అయితే.. నవదీప్ పిటిషన్ ను కొట్టేసింది న్యాయస్థానం.
నవదీప్ కు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి విచారించాలని నార్కోటిక్ బ్యూరో అధికారులను ఆదేశించింది హైకోర్టు. ఇక ఈ కేసులో మరో 14 మంది కన్స్యూమర్లను గుర్తించారు పోలీసులు. నవదీప్ ను విచారిస్తే మరి కొంతమంది కన్స్యూమర్ల పేర్లు బయటకు వస్తాయని అనుకుంటున్నారు పోలీసులు. ఇప్పటి వరకు మొత్తం 35 మంది నిందితులను కనుగొన్నారు.
మరోవైపు, మత్తుపదార్థాల పెడ్లర్స్ పై నిఘా పెంచింది యాంటీ నార్కోటిక్ బ్యూరో. రాయదుర్గం కేసులో అరెస్ట్ అయిన రఘుతేజ వ్యాపారంపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇతను ఇటీవలే బెయిల్ పై బయటకొచ్చాడు. రఘుతేజ మత్తు పదార్థాల సరఫరాలో రూట్ మార్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే అతని లింకులపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. సినిమా ఇండస్ట్రీలోని కొందరికి రఘుతేజ మాదకద్రవ్యాలు సరఫరా చేసినట్లు పోలీసులకు సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది.