మాదాపూర్ మాదక ద్రవ్యాల కేసులో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు దూకుడు పెంచారు. తాజాగా హీరో నవదీప్ (Navadeep) నివాసంలో నార్కోటిక్స్ అధికారులు తనిఖీలు చేశారు. సోదాల సమయంలో నవదీప్ తన ఇంట్లో లేరని తెలుస్తోంది. నవదీప్ ను అరెస్టు (Arrest) చేయవద్దు అంటూ హైకోర్టు (High court) ఇచ్చిన ఆదేశాల గడువు నేటితో ముగియనుంది.
ఈ క్రమంలో నార్కోటిక్ బ్యూరో అధికారులు సోదాలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఇలా వుంటే ఈ కేసులో నవదీప్ 37వ నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల ఈ కేసులో నవదీప్ స్నేహితుడు రాంచంద్ ను పోలీసులు అరెస్టు చేశారు. రామ్ చంద్ నుంచి నవదీప్ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు తమ వద్ద ఆధారాలు వున్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో ఆయన్ని అరెస్టు చేస్తారంటూ వార్తలు వచ్చాయి. నవదీప్ పరారీలో వున్నారంటూ వార్తలు వచ్చాయి. దీన్ని ఖండిస్తూ హీరో నవదీప్ ఇటీవల ట్వీట్ చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని, తాను హైదరాబాద్ లో వున్నానంటూ ట్వీట్ చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని, తనకు పారిపోవాల్సిన అవసరం లేదని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని ఇటీవల నవదీప్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మంగళవారం(ఈ రోజు ) వరకు ఆయన్ని అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేటితో ఈ ఆదేశాల గడువు ముగియనుండటంతో నవదీప్ మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దానికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు నార్కోటిక్ పోలీసులు రెడీ అవుతున్నారు.