లంచం కోసం ఓ కేంద్ర మంత్రి కుమారుడు డిమాండ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతోంది. కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్(Madhya pradesh)లో ఈ ఘటన వెలుగు చూసింది. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ (Narendra Singh Tomar) కుమారుడి వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్(Viral video) కావడం రాజకీయ వర్గాల్లో పెనుదుమారమే రేపుతోంది.
మంత్రి కుమారుడు కోట్లాది రూపాయల డబ్బు విషయమై చర్చించుకుంటున్నట్లు ఆ వీడియోలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో ట్యాగులు పెరుగుతున్నాయి. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరింది. తోమర్ రాజీనామా చేయాలని, వివిధ దర్యాప్తు ఏజెన్సీలు ఈ సమస్యను పరిశీలించాలని పిలుపునిచ్చారు.
నవంబర్ 17న మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి సంబంధిత వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాతే డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కుమారుడు దేవేందర్ సింగ్ తోమర్ లంచం డిమాండ్ చేయడం, కోట్లాది రూపాయల లావాదేవీల గురించి మాట్లాడటం స్పష్టంగా కనబడుతోందన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
దీనిని ఎన్నికల సంఘం తీవ్రమైన అంశంగా పరిగణించాలని కాంగ్రెస్ లీడర్ సుప్రియా శ్రీనాతే డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. తోమర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఈ వీడియో తన పరువు తీసేలా ఎడిట్ చేసినట్లు దేవేంద్ర తోమర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.