చంద్రుడిపై కాలు మోపేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించి విలువైన సమాచారాన్ని సేకరించింది. ఈ క్రమంలో మానవ సహిత ప్రయోగానికి సిద్ధమవుతోంది. మరోవైపు అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా(NASA) 50 ఏళ్ల తర్వాత జాబిల్లిపైకి మనిషిని పంపనుంది.
ఇప్పటికే ఆర్టెమిస్-1 నింగిలోకి దూసుకెళ్లగా.. రానున్న రోజుల్లో ఆరెమిస్-2, 3లను ప్రయోగించనుంది. ఈ తరుణంలో చైనా (China) అంతరిక్ష కార్యక్రమాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా (NASA) అధిపతి బిల్ నెల్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2025 ఏడాదికి నాసా బడ్జెట్ కేటాయింపుల అంశంలో భాగంగా అమెరికా ప్రతినిధుల సభకు చెందిన కమిటీలో పాల్గొని మాట్లాడారు.
డ్రాగన్ తన అంతరిక్ష కార్యక్రమాలను రహస్యంగా ఉంచుతోందని ఆరోపించారు. అక్కడ తన సైనిక ఆపరేషన్లను దాచిపెడుతోందని చట్టసభ సభ్యులతో అన్నారు. దశాబ్దకాలంగా ఈ రంగంలో చైనా అసాధారణ ప్రగతి సాధించిందని, అదంతా ఎంతో రహస్యంగా సాగిందని చెప్పారు. పౌర కార్యక్రమాల ముసుగులో మిలిటరీ ప్రాజెక్టులను చేపట్టిందని భావిస్తున్నామని ఆయన తెలిపారు.
అయితే అమెరికా కూడా దీటుగానే ఈ రేసులో ఉన్నదని, జాబిల్లిపైకి వెళ్లడం ప్రస్తుతం తమపై ఉన్న బాధ్యత అని చెప్పుకొచ్చారు. ఒకవేళ చైనా గనక అక్కడకు ముందుగానే వెళ్తే ఆక్రమణలు తప్పవన్నారు. ఈ రంగంలో దూసుకెళ్లేందుకు చైనా బడ్జెట్లో భారీ కేటాయింపులు చేస్తోందని గుర్తుచేశారు. ఈ మేరకు అన్నింటికీ సిద్ధంగా ఉండటం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.