అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ (Nasa) పాము (Snake)ను పోలి ఉండే ఓ కొత్త రోబో (Robot)ను తయారు చేసింది. తన భవిష్యత్ ప్రయోగాల్లో వినియోగించేందుకు గాను ‘నాసా’దీనిపై పలు దశల్లో పరీక్షలు జరుపుతోంది. చంద్రుడు, అంగారక గ్రహంపై జీవం పుట్టుకకు సంబంధించిన ఆనవాళ్లను పసిగట్టడంలో ఈ రోబో ఉపయోగపడుతుందని నాసా చెబుతోంది.
ఈ రోబోను ‘ఇండియన్ పైథాన్’ఆకారాన్ని, దాని పని తీరు ఆధారంగా రూపొందించారు. ఈ రోబో ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకుని అనుకున్న ప్రదేశానికి చేరుకోగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రోబో వెనుక భారతీయ యువకుడి ప్రతిభ దాగి ఉంది. నాసాలో పని చేస్తున్న భారతీయ ఇంజనీర్ రోహణ్ టక్కర్ దీన్ని రూపొందించారు.
రోహణ్ టక్కర్ నాగ్ పూర్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన నాసాలోని జెట్ ప్రొపల్షన్ లాబోరేటరీలో పని చేస్తున్నాడు. ఎగ్జో బయాలజీ ఎక్స్‌టంట్ లైఫ్ సర్వేయర్(ఈఈఎల్‌ఎస్)గా పిలవబడుతున్న ఈ రోబోను టక్కర్ కనిపెట్టారు. ఈఈఎల్ఎస్ చాలా తెలివైనదని రోహణ్ టక్కర్ వెల్లడించారు.
అత్యంత గరుకైన ప్రదేశాలకు సైతం ఇది వెళ్లగలదని తెలిపారు. ఇది కొండలు, గుహలు, భూమి పగుళ్లు, జలాంతర్బాగంలోనూ ఇది వెళ్లగలదని వివరించారు. ఇతర గ్రహాలపై జీవం ఆనవాళ్లను గుర్తించడంలో ఈ రోబో చాలా ఉపయోగపడుతుందన్నారు. నాసా కోసం మార్టియన్ హెలికాప్టర్ ను రూపొందించిన ఐఐటీకి చెందిన బాబ్ మార్టియన్ నుంచి స్ఫూర్తి పొంది ఈ రోబో తయారు చేసినట్టు వెల్లడించారు.