పుస్తక ప్రియులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. ప్రతీ ఏడాది హైదరాబాద్(Hyderabad)లో జాతీయ పుస్తక ప్రదర్శన(National Book Fair) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ఆనవాయితీగా వస్తున్న ఈ బుక్ ఫెయిర్ ఈ ఏడాది 36వ ఎడిషన్‌తో నేడు(శుక్రవారం) ప్రారంభం కానుంది.
ఈ పుస్తక ప్రదర్శనను రాష్ట్ర సాంస్కృతి, పర్యాటక, అబ్కారీ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) ప్రారంభించనున్నారు. దోమలగూడలోని ఎన్టీఆర్ స్టేడియం(NTR Stadium)లో ఇందుకు వేదికైంది. ఈ బుక్ ఫెయిర్ ప్రతీ రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది.
శని, ఆదివారాల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ పుస్తక ప్రదర్శనలో 365 స్టాళ్లు ఏర్పాటు చేశారు. సాధారణ, ఇంగ్లీషుకు సంబంధించి 214, తెలుగు భాషకు సంబంధించి 115, స్టేషనరీ, హిందీ, ప్రభుత్వ, మీడియా స్టాల్స్ 36, రచయితలకు 6 స్టాల్స్ కేటాయించారు. జాతీయ స్థాయిలో చాలా మంది స్టాల్స్ ఏర్పాటు చేయడం విశేషం.
దీంతో అన్ని భాషల పుస్తకాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉండనున్నాయి. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ వేదికకు సంస్కృత పండితులు రవ్వా శ్రీహరి పేరు, ద్వారానికి ఉర్దూ దినపత్రిక సియాసత్ మాజీ ఎండీ జహీరుద్దీన్ అలీ ఖాన్ పేరు పెట్టినట్లు పేర్కొన్నారు.