దేశ వ్యాప్తంగా న్యూఇయర్ వేడుకల(New Year Celebrations)కు యువత సిద్ధమవుతోంది. డిసెంబర్ 31న రాత్రికి ఏర్పాట్లపై ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. డీజే పాటలు, మందు, విందు, చిందులతో హోరెత్తించేందుకు సిద్ధమయ్యారు. అయితే, న్యూఇయర్ వేడుకలపై పోలీస్ శాఖ ఇప్పటికే నజర్ పెట్టింది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది.
న్యూఇయర్ వేడుకల్లో అసాంఘిక కార్యకలాపాలకే పాల్పడితే ఉపేక్షించేది లేదని పోలీస్ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే మైనర్‌లకు మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. అదేవిధంగా అనుమతి లేకుండా ఎక్కడైనా నిబంధనలు అతిక్రమిస్తూ బహిరంగంగా డీజేలు పెట్టి న్యూసెన్స్ చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఈ మేరకు న్యూఇయర్ వేడుకలకు సంబంధించి పోలీస్ అధికారులు పలు నిబంధనలు వెల్లడించారు. అవేంటో చూద్దాం.. న్యూ ఇయర్ వేడుకలు రాత్రి ఒంటిగంట కల్లా ముగించాలి. ఈవెంట్‌లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ తప్పనిసరి. 45 డెసిబుల్స్ శబ్ధం కంటే ఎక్కువ ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10వేల జరిమానా, ఆరు నెలల జైలుశిక్ష పడుతుంది. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. మత్తు పదార్థాలు వాడితే జీవితంలో కోలుకోలేని చర్యలు తీసుకుంటారు. ఈవెంట్ పేరుతో ట్రాఫిక్ సమస్య సృష్టించొద్దు. కెపాసిటీకి మించి పాసులు ఇవ్వకూడదు.