భారత్ ( India)కు చెందిన ఎనిమిది మంది నేవీ మాజీ సిబ్బందికి మరణ శిక్షను తగ్గిస్తున్నట్టు ఖతర్ నిన్న వెల్లడించింది. ఖతర్ కోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసి న్యాయ బృందం, నేవీ మాజీ సిబ్బంది కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత కేసులో తదుపరి చర్యలను అన్వేషిస్తామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ (Arindam Bagchi) వెల్లడించారు.
కోర్టు తీర్పు కాపీని తాము చూసే వరకు మీడియాకు షేర్ చేసేందుకు తమ దగ్గర ఎలాంటి అదనపు సమాచారం లేదని తెలిపారు. మాజీ అధికారులకు శిక్షలను ఖతర్ కోర్టు తగ్గించదని పేర్కొన్నారు. కానీ తమకు పూర్తి వివరాలు అందేవరకు ఈ విషయంపై తాను ఏమీ మాట్లాడదలుచుకోలేదని స్పష్టం చేశారు. తదుపరి చర్యల గురించి న్యాయ నిపుణులు, మాజీ అధికారుల కుటుంబ సభ్యులతో చర్చిస్తామన్నారు.
భారతీయులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమమే తమ ముందు ఉన్న అతి పెద్ద ఆందోళన అని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారి అరిహా కేసుపై కూడా బాగ్చీ స్పందించారు. ఇది చాలా ముఖ్యమైన అంశమని చెప్పారు. దీనిపై పరిశీలిస్తున్నామన్నారు. ప్రస్తుతం కేసు సంబంధించిన అప్‌డేట్స్ ఏదీ లేదన్నారు. జర్మనీలో భారత జంటకు పుట్టిన చిన్నారి బాధ్యతలను ఆ దేశానికే అప్పగిస్తూ అక్కడి తీర్పు వెల్లడించింది. చిన్నారిని భారత్ కు తీసుకు వచ్చేందుకు తల్లిదండ్రులు పోరాటం చేస్తున్నారు.
ఇటీవల ఖతార్‌లో గూఢచర్యం జరిపారంటూ భారత్ కు చెందిన ఎనిమిది మంది మాజీ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఖతర్ కోర్టు విచారణ జరిపి మాజీ అధికారులకు మరణ శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ఖతర్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. తాజాగా మాజీ అధికారులకు శిక్షను తగ్గిస్తున్నట్టు ఆ దేశం వెల్లడించింది.