తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ (NIA) దాడులు (Raids) సంచలనం రేపాయి. రెండు రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం నుంచే ఎన్ఐఏ దాడులు చేసింది. మొత్తం 62 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. సోదాల సమయంలో ఓ వ్యక్తిని అరెస్టు చేసి అతని నుంచి ఆయుధాలు (Weapons), విప్లవ సాహిత్యం, నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
ఏపీతో పాటు తెలంగాణలోని పౌరహక్కుల నేతలు, అమర బంధు మిత్రుల సంఘం నాయకుల నివాసాల్లో ఎన్ఐఏ సోదాలు చేశాయి. ముంచింగి పట్టు మావోయిస్టుల కేసుకు సంబంధించి ఈ దాడులు చేసినట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఎన్ఐఏ ఓ ప్రకటన విడుదల చేసింది. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 62 ప్రాంతాల్లో తనిఖీలు చేసినట్టు అధికారులు వెల్లడించారు.
ఏపీలోని 53 చోట్ల, తెలంగాణ 9 చోట్ల తనిఖీలు నిర్వహించినట్టు చెప్పారు. గుంటూరు, రాజమహేంద్రవరం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, విజయనగరం, విశాఖ, విజయవాడ, ప్రకాశం, ఏలూరు జిల్లాలో తనిఖీలు నిర్వహించినట్టు చెప్పారు. ఇక తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, హనుమకొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో సోదాలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
ఏపీలోని సత్యసాయి జిల్లాలో ప్రగతి శీల కార్మిక సమాఖ్య నాయకుడు చంద్ర నరసింహులు నివాసంలో సోదాలు నిర్వహించామన్నారు. అనంతరం నరసింహులను అరెస్టు చేసి అతని నుంచి తుపాకీ, 14 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కడప జిల్లాలో తనిఖీలు నిర్వహించి రూ.13 లక్షల నగదు, మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇది ఇలా వుంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయని పౌర హక్కుల, ప్రజా సంఘాల నాయకులు అన్నారు. తమ అవినీతి నేతల బాగోతం ఎక్కడ భయట పడుతుందోనని భయంతోనే ప్రభుత్వాలు ఎన్ఐఏతో దాడులు చేయిస్తున్నాయని చెప్పారు. ఈ దాడులతో ప్రధాని మోడీతో పాటు సీఎం జగన్, కేసీఆర్ కు సంబంధం ఉందన్నారు.
రాష్ట్రంలో పౌరుల ప్రాథమిక హక్కులకు జాతీయ దర్యాప్తు సంస్థ భంగం కలిగిస్తోందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అవినీతి నేతలకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమయ్యారన్నారు. ప్రజా సంఘాలు తమను ఎండగడుతాయనే భయంతోనే ఈ దాడులు చేయిస్తున్నారన్నారు. మెదక్‌లో నెల రోజుల క్రితం జయదేవ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారన్నారు. తెలంగాణలో ప్రధాని పర్యటన సమయంలోనే ఎన్ఐఏ దాడులు కేవలం షో చేయడానికే నన్నారు.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ కవులు, రచయితలు, ప్రజా సంఘాల నేతలపై ఎన్ఐఏ ఆకస్మిక దాడులు చేస్తోందన్నారు. ఇన్నేండ్లుగా లేని అనుమానం కేవలం ఎన్నికల ముందే గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు. ఉపా చట్టం పేరు చెప్పి అందర్ని హింసిస్తున్నారన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని పోరాటాలు చేస్తున్నా దాన్ని వాడుకుని ఎన్ఐఏ అక్రమ దాడులు చేస్తోందన్నారు.
ఎన్ఐఏ అధికారులే ఆ నిషేధిత వస్తువులు, పుస్తకాలను తీసుకు వచ్చి పౌర సంఘం నేతల ఇండ్లల్లో పెట్టి ఫోటోలు, వీడియోలు తీసి అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం కొంత మంది వ్యక్తులు గోడ దూకి వచ్చి తమ ఇంట్లోకి వచ్చారని బాధితుడు కృష్ణ అన్నారు. తన భార్య పేరిట సెర్చ్ వారెంట్ ఇచ్చారన్నారు.