బెంగళూరు(Bangalore) సెంట్రల్ జైలు నుంచి పరారైన లష్కరే తోయిబా తీవ్రవాదుల(Lashkar-e-Toiba terrorists)ను పట్టుకునేందుకు ఎన్ఐఏ(NIA) దేశవ్యాప్తంగా సోదాలు చేస్తోంది. ఏడు రాష్ట్రాలో 17చోట్ల ఎన్ఐఏ బృందాలు జల్లెడ పడుతున్నాయి. ఢిల్లీ, ముంబై, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
ఈ కేసులో 2023 జులైలో లష్కరే తోయిబా తీవ్రవాది నజీర్ భావజాలానికి ఆకర్షితులై పనిచేస్తున్న ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఏడు పిస్తోళ్లు, నాలుగు హ్యాండ్ గ్రానేడ్లు, 45 లైవ్ రౌండ్లు, నాలుగు వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బెంగళూరు పోలీసులు ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించారు.
ఈ కేసు దార్యప్తులో భాగంగా..2024, జనవరిలో ఛార్జిషీటు దాఖలు చేసిన ఎన్ఐఏ అధికారులు నిందితులకు పలు కేసుల్లో తీవ్రవాద సంస్థలతో ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. ఈ ఏడాది జనవరి 12వ తేదీన బెంగళూరు లష్కరే తోయిబా (ఎల్ఈటీ) జైలులో జీవిత ఖైదీలు, ఇద్దరు పరారీలో ఉన్నవారితో సహా ఎనిమిది మందిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చార్జిషీట్ దాఖలు చేసింది.
నిందితుల్లో కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన నజీర్ కూడా ఉన్నారు. అతను 2013 నుంచి బెంగళూరు సెంట్రల్ జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. జునైద్ అహ్మద్ అలియాస్ జేడీ, సల్మాన్ ఖాన్ విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. మొత్తం ఎనిమిది మంది నిందితులపై భారతీయ శిక్షాస్మృతి, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, పేలుడు పదార్థాల చట్టం, ఆయుధాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగపత్రం నమోదు చేశారు.