దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ(NIA) అధికారులు సోదాలు నిర్వహించారు. నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠాను అధికారులు గుట్టు రట్టు చేశారు. వారు వివిధ మార్గాల ద్వారా భారత్లోని చాలా ప్రాంతాలకు నకిలీ కరెన్సీ సరఫరా చేస్తున్నారని అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్ర(Maharastra)లోని కొల్హాపూర్ (Kolhapur) జిల్లాలో నిందితుడు రాహుల్ తానాజీ పాటిల్ అలియాస్ జావేద్, ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో వివేక్ ఠాకూర్ అలియాస్ ఆదిత్య సింగ్, కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో మహేంద్ర, అనుమానితుడు శివాపాటిల్ అలియాస్ నివాసాలపై ఎన్ఐఏ బృందాలు దాడులు చేశాయి.
వివేక్ ఠాకూర్ ఇంట్లో కరెన్సీ ప్రింటింగ్ పేపర్లతో పాటు రూ.6,600 నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. వివేక్, శివ పాటిల్ మరి కొందరు కలిసి నకిలీ కరెన్సీని, ప్రింటింగ్ పరికరాలను సేకరించేవారని ఎన్ఐఏ తెలిపింది. నకిలీ నోట్లు, కరెన్సీ ప్రింటింగ్ పేపర్, ప్రింటర్, డిజిటల్ గాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఏడాది నవంబర్ 24న నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా యాంటీ టెర్రర్ ఏజెన్సీ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, బీహార్ల్లో ఎన్ఐఏ ఈ సోదాలు నిర్వహించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఎన్ఐఏ బృందాలు తెలిపాయి. ఇలాంటి చర్యలు పాల్పడుతున్న వారు ఇంకా ఉన్నారా? అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.