కృష్ణమ్మ (Krishna) నీటిని పాలమూరు (Palamuru)బీడు భూముల్లో పారించాలన్న ప్రజల కోరిక నేటితో నెరవేరిందని తెలంగాణ వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ నుంచి కృష్ణా నీటితో తీసుకువచ్చిన కలశాన్ని ఊరేగించి, అనంతరం వనపర్తి వెంకటేశ్వర స్వామిని అభిషేకించారు.
భారతదేశ చిత్రపటంలో ఆకుపచ్చ తెలంగాణ శాశ్వత చిరునామాగా నిలుస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. దీంతో సుస్థిరమైన అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ మరో మైలురాయిని దాటినట్లయిందని తెలిపారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
గతంలో వెయ్యి అడుగుల లోతుకు తవ్వినా తాగునీరు లభించేది కాదని తెలిపారు. కానీ నేడు 300 అడుగుల భూగర్భంలో సుమారు 60 కిలోమీటర్ల సొరంగాలలో కృష్ణమ్మ ప్రవహిస్తోందని చెప్పారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల ఆరు జిల్లాలలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారనీ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేడు, రేపు ప్రతీ గ్రామానికి కృష్ణా నీటిని తీసుకెళ్లి, వాటితో ఆయా గ్రామాల్లోని దేవీదేవతలకు అభిషేకాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.