తాను చిన్నప్పటి నుంచీ తెలుగు భాష వింటూనే పెరిగానని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తెలిపారు. విజయవాడ(Vijayawada)లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కృష్ణవేణి సంగీత నీరాజనం(Krishnaveni Sangeetha Neerajanam) కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహణకు సహకరించిన ఏపీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ‘నేను చిన్నప్పటి నుంచీ తెలుగు వింటూనే పెరిగా. ఒకప్పుడు దేశవిదేశాల్లో గుర్తింపు రావాలంటే చెన్నై, తమిళనాడు వెళ్లాల్సి వచ్చేంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సదవకాశాన్ని కల్పించింది. మొవ్వ, తంజావూరు, రాజమండ్రి, బొబ్బిలి లాంటి ప్రాంతాలను ప్రతీఒక్కరు గుర్తుంచుకోవాలి. కార్తీక మాసంలో ప్రతీ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి’ అని చెప్పుకొచ్చారు.
అదేవిధంగా ఈ గానామృతం ప్రతీ సంవత్సరం దేశ విదేశాలకు వెళ్లాలని కేంద్రమంత్రి కోరారు. తెలుగు వింటేనే ఎంతో అద్భుతమైన భావం కలిగిస్తుందని తెలిపారు. లాక్డౌన్ సమయంలో తాను సంగీతాన్ని ఆస్వాదించినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గుర్తుచేసుకున్నారు. ఈ మధ్య సంగీతంతో వైద్యం చేస్తున్నారని చెప్పారు. విదేశాల నుంచీ తెలుగువారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
అదేవిధంగా ఏపీ మంత్రి రోజా కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహించే అవకాశం ఏపీ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినందుకు నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలిపారు. నిర్మలా సీతారామన్ చాలామంది మహిళలకు ఆదర్శమన్నారు. మహిళగా ఎదగడానికి ఎన్నో ఆటంకాలుంటాయన్నారు. కృష్ణవేణి సంగీత నీరాజనం ఈతరం వారికి ఒక గొప్ప అవకాశమని తెలిపారు.
సంగీతం ఎలాంటి భావాన్నైనా ప్రతిబింబించేందుకు ఒక అస్త్రం లాంటిదన్నారు రోజా. మూడు రోజులపాటు ఈ కృష్ణవేణి సంగీత నీరాజనం జరుగుతుందని, ఒకవైపు కృష్ణమ్మ పరవళ్ళు, మరోవైపు సంగీతం మనల్ని పరవశింపజేస్తాయని అభివర్ణించారు. కర్ణాటక సంగీతం తెలుగునేల మీద విరాజిల్లుతూనే ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా పాల్గొన్నారు.