పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ( Budget Session) ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మధ్యంతర బడ్జెట్లో ఎలాంటి పన్ను ప్రకటనలు ఉండబోవని ఇప్పటికే నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఇక బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టడం వరుసగా ఇది ఆరవసారి. దీంతో మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును ఆమె సమం చేయబోతున్నారు. దేశంలో పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె ఇప్పటికే ఘనత సాధించారు. 2019 జూలై నుంచి ఆమె ఇప్పటి వరకు ఐదు బడ్జెట్లు ప్రవేశ పెట్టారు.
గతంలో మాజీ ఆర్థిక మంత్రులు మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పీ. చిదంబరం, యశ్వంత్ సిన్హాలు వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. తాజాగా ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశ పెడుతున్న నిర్మలా సీతారామన్ వాళ్లందరి రికార్డులను అధిగమించనున్నారు. అంతకు ముందు ఆర్థిక మంత్రిగా 1959-1964 మధ్య కాలంలో మొరార్జీ దేశాయ్ ఐదు వార్షిక బడ్జెట్, ఒకసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్లో పెద్ద విధాన పరమైన మార్పులు ఏమి ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఆదాయపన్ను విషయంలో ఊరట కలిగించే ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.