తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై బీజేపీ (BJP)ఎంపీ (MP) నిషికాంత్ దూబే (Nishikant Dubey) సంచలన ఆరోపణలు చేశారు. ప్రశ్నకు డబ్బు కేసులో మహువా మొయిత్రా చిక్కుకు పోయారని ఆరోపించారు. అదానీ గ్రూప్, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసి మాట్లాడేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ (Darshan Hiranandani)నుంచి రూ.2 కోట్లు, ఐఫోన్, ఎన్నికల ఖర్చుకు మరో రూ.75 లక్షలను ఎంపీ మహువా తీసుకుని అడ్డంగా దొరికిపోయారని తన లేఖలో నిషికాంత్ దూబే పేర్కొన్నారు.
2019 నుంచి 2023 మధ్య కాలంలో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 దర్శన్ హీరానందానీ కోరిక మేరకు అడిగినవే అని ఆరోపించిన నిషికాంత్ దూబే.. దీనికి సంబంధించిన సాక్ష్యాలను ఓ న్యాయవాది తనకు అందచేసినట్టు తెలిపారు. ఈ ఆరోపణలతో పాటు తన వ్యక్తిగత పార్లమెంట్ లాగిన్ ఐడీని మహువా మోయిత్రా ఇతరులకు అప్పగించిందన్న నిషికాంత్ దూబే.. తాజాగా మరో సంచలన ఆరోపణ చేశారు.
మహుమా మోయిత్రా భారతదేశంలో ఉన్నప్పుడు దుబాయ్ నుంచి ఆమె పార్లమెంట్ ఐడీని ఉపయోగించారని, ఈ విషయాన్ని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (NIC),విచారణ సంస్థలకు అందించిందని ఆమె పేరు నేరుగా ప్రస్తావించకుండా నిషికాంత్ దూబే ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంలో టీఎంసీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాకి.. కేంద్ర ఐటీ శాఖ మంత్రికి.. లేఖలు రాశారు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే.. .