ప్రస్తుత రాజకీయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మంచి పనులు చేసే రాజకీయ నాయకులకు (Politicians) గౌరవం దక్కడం లేదని తెలిపారు. అలాగే చెడ్డ పనులు చేసే అవినీతి పరులైన రాజకీయ నాయకులకు శిక్ష పడటం కూడా ఇప్పుడు చాలా కష్టతరంగా మారిందని వెల్లడించారు.
ముంబైలో ఓ మీడియా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ…. ‘నేను ఎప్పుడూ సరదాగా చెబుతూ ఉంటాను. అది ఏ పార్టీ ప్రభుత్వమైనా సరే మంచి పనులు చేసే వారికి సరైన గౌరవం లభించడం లేదు. అంతే కాకుండా చెడ్డ పని చేసిన వారికి శిక్షలు పడటం లేదు’అని అన్నారు. ప్రస్తుతం భావజాలం క్షీణిస్తోందని… అది ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నారు.
చర్చల్లో అభిప్రాయ భేదాలు ఉండటం సమస్య కాదని చెప్పారు. కానీ సరైన ఆలోచన లేకపోవడమే అసలు సమస్య అని వెల్లడించారు. కొంత మంది తమ సిద్దాంతాల వల్ల చాలా దృడ నిశ్చయంతో ఉంటారని పేర్కొన్నారు. అలా విలువలకు కట్టుబడే వారి సంఖ్య ప్రస్తుతం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని. ఈ ప్రత్యేకత వల్లే మన పాలనా వ్యవస్థ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.
రైటిస్టు కాదు లెఫ్టిస్టు కాదు, మనమంతా అవకాశవాదులమని అన్నారు. అధికారంలో ఉన్న పార్టీతో అనుబంధం కొనసాగించాలని అంతా అనుకుంటారని వెల్లడించారు.
రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారని చెప్పారు. పాపులారిటీ, పబ్లిసిటీ అవసరమే కానీ, నేతలు తమ నియోజకవర్గాల్లో చేసిన పనే వారికి గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకు వస్తుందన్నారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ తర్వాత రక్షణ శాఖ మాజీ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ తీరు తనను చాలా ఆకట్టుకుందని వెల్లడించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వాక్చాతుర్యాన్ని ఆయన కొనియాడారు. ఇటీవల భారతరత్న పురస్కరాన్ని పొందిన బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్ విషయాన్ని ప్రస్తావించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు.