ఫీజు చెల్లించకుంటే విద్యార్థులను పరీక్షకు అనుమతించబోమని యాజమాన్యం తెగేసి చెప్పటంతో నిజాం కాలేజీ(Nijam College)లో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. సెమిస్టర్ ఫీజు(Semester Fee) చెల్లించలేదనే సాకుతో పలువురు విద్యార్థులను పరీక్ష రాయనీయకుండా నిజాం కాలేజీ యాజమాన్యం అడ్డుకుందని ఆరోపించారు. ఫీజు కట్టని విద్యార్థులకూ పరీక్ష రాసేందుకు అనుమతిస్తేనే తామూ పరీక్షలు రాస్తామని విద్యార్థులంతా ఏకమయ్యారు.
దీంతో యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. విద్యార్థులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫీజు చెల్లింపు విషయంలో గతంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని విద్యార్థులు తెలిపారు. అప్పడూ ఫీజు కట్టించుకున్న తర్వాతే పరీక్ష రాసేందుకు యాజమాన్యం అనుమతిచ్చిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈసారి మాత్రం తాము ఫీజు కట్టేందుకు రెడీగా ఉన్నామని తెలిపినా, యాజమాన్యం తమను పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వడంలేదని విద్యార్థులు వాపోయారు.
అయితే, ఉన్నపళంగా ఫీజు విషయాన్ని ముందుకు తీసుకొచ్చి తమను సెమిస్టర్ పరీక్షలు రాయనీయకుండా యాజమాన్యం అడ్డుకుంటుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు కట్టాలని తమకు పది రోజుల ముందు నోటీసు ఇచ్చి ఉంటే నిర్దిష్ట సమయంలోనే ఫీజు చెల్లించే వాళ్ళమని మరి కొంతమంది విద్యార్థులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఫీజు చెల్లించిన విద్యార్థులు సైతం పరీక్షను బహిష్కరించారు.
మొత్తం 15మంది విద్యార్థులు సెమిస్టర్ ఫీజు కట్టలేదు. ఈ 15మందిని పరీక్ష రాసేందుకు నిజాం కాలేజ్ యాజమాన్యం అనుమతించలేదు. దీంతో ఆ విద్యార్థులకు మద్దతుగా మిగిలిన విద్యార్థులు సైతం పరీక్ష రాయబోమని విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. ఆ 15మంది విద్యార్థులకు పరీక్ష రాసేందుకు అనుమతిస్తేనే తామూ పరీక్షలు రాస్తామని విద్యార్థులు భీష్మించి కూర్చున్నారు.