రాష్ట్రంలో భూములను కబ్జా చేస్తున్న వారు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. కబ్జా చేసిన భూములను ఫ్లాట్స్ గా విభజించి అమాయకులకు తక్కువ ధరకు కట్టబెడుతోన్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగు చూసింది.
ఆర్మూర్ (Armour) నియోజకవర్గంలోని కోటార్మూర్ (Kotarmoor) గ్రామంలో 63వ నంబర్ జాతీయ రహదారి పక్కన భూమిని.. 2007లో ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు (Real Estate Traders) కొనుగోలు చేశారు. ఆ భూమి అదే గ్రామానికి చెందిన రియల్ వ్యాపారి ప్రొద్దుటూరి నరసింహారెడ్డిది. ఇతని వద్ద నుంచి 40-3,40-4 సర్వే నంబర్లలోని 25 గుంటల భూమిని కొనుగోలు చేసిన ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. రెండు రోడ్లకు స్థలం పోగా.. మిగిలిన భూమి కంటే అదనంగా ఇతరులకు విక్రయించారు.
అదీగాక వీరు గతంలో గ్రామ ప్రజల నీటి అవసరాల కోసం ఉంచిన భూమిని కూడా కబ్జా చేసి అమ్ముకునేందుకు ప్రయత్నించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.. భూములను కబ్జాలు చేస్తూ అమ్మకాలు జరుపుతున్న రియల్ వ్యాపారులకు మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు సపోర్ట్ ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కోటార్మూర్ గ్రామంలో గతంలో గ్రామ ప్రజల నీటి అవసరాల కోసం వదిలిన స్థలాన్ని, బోరుబావిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన సంఘటనను ఆధారాలు, ఫొటోలతో సహా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్‌కు స్థానికులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
దీంతో రాత్రికి రాత్రే ఆ స్థలంలో బోరుబావిని తీయించిన మున్సిపల్ కమిషనర్‌ను స్థానికులు నిలదీశారు. అయినా ఆ కబ్జా వ్యవహారం అలాగే కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.. ఈ క్రమంలో ఇలా యధేచ్చగా కబ్జాలకు పాల్పడుతోన్న వీరిపై, వీళ్ళకు వత్తాసు పలుకుతోన్న అధికారులపై చర్యలు తీసుకొని.. భూములను కాపాడాలని స్థానికులు విన్నవించుకుంటున్నారు.