నిజామాబాద్ (Nizamabad)లో కాల్పులు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితం ఓ రౌడీ షీటర్ మరో ఇద్దరు కలిసి తమ వద్ద ఉన్న తుపాకితో గాలిలో కాల్పులు జరిపారని నగరంలోని 6వ టౌన్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో మిర్చికంపౌండ్‌కు చెందిన ఒక రౌడిషీటర్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ఇక నగరంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో 24 గంటలు తెరిచి ఉండే భవాని దాబా (Bhavani Daba).. దాని వెనుక ఒక బెల్ట్ షాప్ అనుబంధంగా ఉండటంతో.. మద్యం కొనుగోలు చేసి సేవించిన వారు దాబాలో తినడం నిత్యం తంతుగా మారింది. ఈ క్రమంలో సంబంధిత బెల్ట్ షాప్ వద్ద ముగ్గురు వ్యక్తులు తుపాకితో గాలిలో కాల్పులు జరిపారనే ఆరోపణలున్నాయి. ఈ విషయం పై సమాచారం అందుకొన్న స్థానిక సీఐ, ఎస్సైలు రాత్రి విచారణ జరిపినట్లు తెలుస్తోంది.
కానీ ఈ విషయంపై స్థానికంగా ఎవరు నోరు మెదపడం లేదు. ఒకవేళ జరిగింది తెలిస్తే రాత్రి వేళ జరిగే మద్యం, మంచింగ్ దందా బంద్ అవుతుందని నిర్వాహకులు నోరు తెరవడం లేదనేది చర్చ జరుగుతుంది. మరోవైపు ట్రైనీ ఐపీఎస్ చైతన్య రెడ్డి (Trainee IPS Chaitanya Reddy)తో పాటు మరి కొందరు అధికారులు ఈ ఘటన జరిగిందా లేదా అన్న అంశంపై నేడు మరోసారి విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల పాత బస్తీలో పోలీసులకు చిక్కిన కాలపత్తార్‌కు చెందిన రౌడి షీటర్ అసద్.. నిజామాబాద్ లో తాను గన్ కొనుగోలు చేశానని పోలీసుల వాంగ్మూలంలో తెలిపిన విషయం అందరికీ విధితమే. గత ఏడాది సెప్టెంబర్‌లో నిజాం కాలనీలో హంజల బేగ్ అనే పీడీఎస్ దందా ఏజంట్ వద్ద నాటు తుపాకీ దొరకడంతో ఆ కేసు విచారణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.