ఈసారి తెలంగాణ (Telangana)లో జరిగే ఎన్నికల్లో ఎన్నో సిత్రాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే (MLA) పదవి అంటే కొందరికే పరిమితం అయిన రోజుల నుంచి ఎవరైనా పోటీ చేస్తాం అనే రోజులు ఈ ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఈ సెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నాయకులతో పాటు నిరుద్యోగులు కూడా పోటీ చేయడమే.. అదీగాక కొందరు ఎన్నికల ప్రచారాలను కొత్తగా నిర్వహిస్తూ పలువురిని ఆకట్టుకుంటున్నారు.
ఇలాంటి ఘటనలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. మరోసారి ఓ ఎమ్మెల్యే అభ్యర్ధి చిత్రమైన వేషధారణతో చేసిన ప్రచారం వార్తల్లో నిలిచింది. ఇప్పటికే సోషల్ మీడియా పుణ్యమా అని బర్రెలక్క ప్రచారంలో దూసుకెళ్తుంది. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఓ యువకుడు అర గుండు, అర మీసంతో భిక్షాటన చేస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నాడు. అతని పేరు మేత్రి రాజశేఖర్.. నిజామాబాద్ (Nizamabad) జిల్లా రూరల్ నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగి..
ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేత్రి రాజశేఖర్ (Metri Rajasekhar) ఎన్నికల ప్రచారాన్ని అందరిలా కాకుండా కొత్తగా చేయాలని భావించి విచిత్ర వేషం కట్టారు.. అర గుండు, అర మీసం, చిరిగిన బట్టలు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చిన తరువాత చేస్తామన్న హామిల ప్లకార్డులను మెడలో వేసుకుని ఓట్లు అడుగుతున్నాడు. ప్రజల్లో చైతన్యం రావాలని, అవినీతిపరుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రచారంలో తెలియచేస్తున్నాడు.
మరోవైపు తెలంగాణ ఉద్యమకారుడిగా, విద్యారంగ, నిరుద్యోగ, ప్రజాసమస్యలపై ఉద్యమ పోరాటం చేసానని అంటూన్న రాజశేఖర్.. ఎన్నికలు రాగానే 400లకే గ్యాస్ సిలిండర్ ఇస్తానని అంటున్న ప్రభుత్వం.. రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాడు. దళితున్ని సీఎం చేస్తానని మాటయిచ్చిన వారు ఎందుకు చేయాలేదని ప్రశ్నించారు. ఇట్లా ఓట్ల కోసం మాటలు చెప్పే వారిని నమ్మవద్దని ఓటర్లను కోరారు రాజశేఖర్.