ఒకే కుటుంబంలో ఆరుగురు దారుణ హత్యకు గురైన ఘటన కామారెడ్డి జిల్లా(Kamareddy District)లో సంచలనం సృష్టించింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు ఈ హత్యలపై విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి కోసం స్నేహితుడితోపాటు అతడి భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లను అతిదారుణంగా హత్య చేసిన నిందితుడు ప్రశాంత్‌తోపాటు అతడికి సహకరించిన మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కామారెడ్డి ఎస్పీ(SP) సింధూ శర్మ(Sindhu Shrama) మీడియాకు వెల్లడించారు.
మాక్లూరులో ఉన్న ప్రసాద్ ఇంటిపై అతడి స్నేహితుడు ప్రశాంత్ కన్నేశాడు. ప్రసాద్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండడంతో అదే అదనుగా ప్రశాంత్ బ్యాంకు లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. అయితే ఎంత ప్రయత్నించినా బ్యాంకు లోన్ రాలేదు. దీంతో ప్రశాంత్ మాయమాటలు చెప్పి.. ఇంటిని తన పేరుపై రాయాలని ప్రసాద్‌ను ఒత్తడికి గురిచేశాడు. అందుకు ప్రసాద్ ఒప్పుకోకపోవడంతో ఎలాగైనా ఇంటిని తన వశం చేసుకోవాలని పథకం పన్నాడు.
గత నెల 29న మాక్లూర్ మండలం మదనపల్లి వద్ద అటవీ ప్రాంతంలో ప్రశాంత్‌తో పాటు వంశీ, విష్ణులు కలిసి రాళ్ళు, కర్రలతో కొట్టి ప్రసాద్‌ను హత్య చేశారు. అనంతరం మదనపల్లి అటవీ ప్రాంతంలోనే ప్రసాద్‌ను పూడ్చి పెట్టారు. డిసెంబర్ 1న ప్రసాద్ భార్య శాన్విక, చెల్లెలు శ్రావణిని నిందితుడు ప్రశాంత్ నిజామాబాద్ తీసుకెళ్లాడు. ప్రసాద్ జైలులో ఉన్నాడని అతడిని కలుద్దామని భార్య శన్వికను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నానని నమ్మబలికి బాసర వంతెన వద్ద తాడుతో గొంతు బిగించి చంపి గోదావరిలో పడేశారు.
ప్రసాద్ దగ్గరికి వెళ్తామని చెప్పి శ్రావణిని సైతం తీసుకెళ్లి మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద చంపి తగులబెట్టారు. అదేతీరులో ప్రసాద్ తల్లి, పిల్లలు, మరో చెల్లెలిని ప్రసాద్ దగ్గరికి వెళ్తామని చెప్పి నిందితుడు ప్రశాంత్ వారిని నిజామాబాద్ లో లాడ్జిలో ఉంచాడు. ఈనెల 4న ప్రసాద్.. పిల్లల్ని చూడాలని అడిగాడని చెప్పి పిల్లలను తన మైనర్ తమ్ముడితో కలిసి తీసుకెళ్లి చంపి మెండోర సొన్ బ్రిడ్జి వద్ద నీళ్లలో పడేశారు. ఈనెల 13న మరో చెల్లెలు స్వప్నను సదాశివనగర్ మండలం భుంపల్లి వద్ద గొంతు నులిమి చంపి పెట్రోల్ పోసి తగులబెటారు.
కుటుంబ సభ్యులు ఎవ్వరూ తిరిగి రాకపోగా అనుమానంతో లాడ్జి నుంచి ప్రసాద్ తల్లి తప్పించుకుని పారిపోయింది. ఆమె కోసం కామారెడ్డి జిల్లా పాల్వంచకు వస్తుండగా ప్రశాంత్, వంశీ, విష్ణు మైనర్ బాలుడిని కామారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన ప్రసాద్ కుటుంబ సెల్ఫోన్లు నిందితుడి వద్ద లభించాయి. ప్రసాద్ తల్లిని కూడా చంపాలని ప్రశాంత్ భావించాడు. పోలీసులకు ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రసాద్, అతడి భార్య మృతదేహాలు ఇంకా లభించలేదు. నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరపర్చి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ సింధూ శర్మ తెలిపారు.