ప్రధాని మోడీ (Modi) ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండో రోజైన బుధవారం చర్చ జరగనుంది. ప్రతిపక్షాల తరఫున కాంగ్రెస్ (Congress) అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్ సభలో చర్చను ప్రారంభించనున్నారు. నిన్న చర్చను ప్రారంభించిన పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్.. మణిపూర్ అంశంపై పాలక బీజేపీమీద విరుచుకపడ్డారు. ఇక ఈ తీర్మానంపై రెండో రోజున రాహుల్ చర్చను ప్రారంభిస్తారని పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు.
పార్లమెంటులో తమకు మెజారిటీ తక్కువగా ఉన్నప్పటికీ.. మణిపూర్ పరిస్థితిపై మోడీ తప్పనిసరిగా సభకు వచ్చి ప్రకటన చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. బీజేపీ తరఫున హోమ్ మంత్రి అమిత్ షా ఈ చర్చలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, హెబీ ఎడెన్ కూడా మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.
. మణిపూర్ అంశంపై 267 నిబంధన కింద చర్చ చేబట్టాలంటూ వరుసగా కాంగ్రెస్ నుంచి రాజీవ్ శుక్లా, ఆర్జేడీ తరఫున మనోజ్ ఝా, ఆప్ నుంచి రాఘవ్ చద్దా వాయిదా తీర్మాన నోటీసులిచ్చారు.
అలాగే మణిపూర్, హర్యానా అంశాలపై రాజ్యసభలో చర్చ జరపాలని ఆప్ ఎంపీ సుశీల్ గుప్తా వాయిదా తీర్మాన నోటీసును అందజేశారు. మంగళవారం మాదిరే బుధవారం కూడా పార్లమెంట్ లో వాడిగా, వేడిగా చర్చ కొనసాగవచ్చు.