కాంగ్రెస్ (Congress)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్ష ఇండియా కూటమికి చెందిన నేతలు తమ పిల్లలు తమ పార్టీలో ప్రముఖ పదవులు చేపట్టాలని కోరుకుంటారని అన్నారు. తమ కుటుంబం కోసం అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న వారు ఎప్పటికైనా పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తారా అని ప్రశ్నించారు.
దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన బీజేపీ నేషనల్ కన్వెన్షన్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్బంగా అమిత్ షా ప్రసంగిస్తూ….రాజకీయాల్లో ఇండియా కూటమి లక్ష్యం ఏమిటి? అని నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయం సమృద్ధితో కూడిన భారత దేశాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు.
కానీ రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే సోనియాగాంధీ లక్ష్యమని చెప్పారు. కుమార్తెను ముఖ్యమంత్రిని చేయడమే పవార్ సాహెబ్ లక్ష్యమని ఎద్దేవా చేశారు. మేనల్లున్ని సీఎంగా చేయడమే మమతా బెనర్జీ టార్గెట్ అన్నారు. ఇక కొడుకును సీఎంగా చేయడమే ఎంకే స్టాలిన్ లక్ష్యం… లాలూయాదవ్ తన కొడుకును సీఎం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ తన బుజ్జగింపు రాజకీయాల వల్లే రామాలయ ప్రతిష్ఠాపన వేడుక ఆహ్వానాన్ని తిరస్కరించిందని ఫైర్ అయ్యారు. ఇండియా కూటమి, ముఖ్యంగా కాంగ్రెస్… దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని నాశనం చేసిందని ఆరోపణలు గుప్పించారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులు, కులతత్వంతో దేశంలో ప్రజాస్వామ్యం అని కాంగ్రెస్ రంగు పులుముకుందని నిప్పులు చెరిగారు.
ఇండియా కూటమిలో ఏడు కుటుంబ పార్టీలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో కుటుంబ రాజకీయాలకు మోడీ పుల్ స్టాప్ పెట్టారన్నారు. కాంగ్రెస్, ఇండియా కూటమి… దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులను తమ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొదటిసారిగా ఆ వర్గాలకు బీజేపీ ప్రభుత్వం హక్కును కల్పించిందని వెల్లడించారు. దేశంలో రాజకీయం పాండవులు, కౌరవుల్లాగా మారిపోయిందన్నారు. తమది పాండవుల కూటమని, కాంగ్రెస్ ది కౌరవుల కూటమి అని వ్యాఖ్యలు చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కౌరవులను పాండవుల కూటమి ఓడిస్తుందని తెలిపారు.