ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నవేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.. అందులో సీఎం జగన్ (CM Jagan) ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ అనౌన్స్ చేయడంతో వైసీపీ (YCP)లో టిక్కెట్ దక్కని వారు అక్కసు వెళ్లగక్కుతున్నారనే వార్తలు వ్యాపించడంతో.. ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) స్పందించారు.. వైసీపీని టార్గెట్ చేసి ఎన్ని ఆరోపణలు చేసిన తమ విజయాన్ని ఆపలేరని తెలిపారు.. ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, పాలన వైసీపీ బలం అన్నారు..
ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న సుబ్బారెడ్డి.. సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతోన్న పేదలందరూ వైసీపీని మరోసారి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు సీట్లు ఇవ్వటం కోసమే కొన్ని సీట్లు సర్దుబాటు చేయాల్సి వస్తుంది.. అంతమాత్రానికే పదవుల కోసం పక్క పార్టీలోకి వెళ్ళడం తగదని సూచించారు.. అలా వెళ్లే వాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన వెళ్తున్నారని విమర్శించారు. ఒకరిద్దరు పార్టీ విడితే నష్టం లేదని తెలిపారు..
సీఎం జగన్.. ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.. ఆయన ఎలా ఆదేశిస్తే అలా పనిచేస్తాం అన్నారు. చంద్రబాబు ఎన్ని యాత్రలు చేసినా, డ్రామాలు వేసినా ప్రజలు టీడీపీని నమ్మే పరిస్దితి లేదని మండిపడ్డారు. అందరికీ సమన్యాయం చేసేందుకే కృషి చేస్తున్న జగన్.. ఇందులో భాగంగా ఇప్పటికీ 35 నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేసినట్టు పేర్కొన్నారు..
చంద్రబాబు తన హయాంలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా పాలన చేశారని ఆరోపించిన వైవీ సుబ్బారెడ్డి.. ఆసమయంలో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు, విమర్శలు పక్కన పెట్టి.. ఇప్పుడు బాబు చుట్టూ తిరగడం ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు.. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీలో మళ్ళీ వచ్చేది జగన్ ప్రభుత్వమే అన్నారు.. సీఎం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల వల్లే 175 నియోజకవర్గాల్లో గెలుస్తామనే భరోసాలో ఉన్నట్టు సుబ్బారెడ్డి తెలిపారు..