కార్తీక మాసాన్ని హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు. శివుడికి ప్రీతిపాత్రమైన మాసం కావడంతో భక్తులు అత్యంత నిష్టగా పూజలు చేస్తారు. దీంతో మార్కెట్లో మాంసం ధరలపై ప్రభావం పడింది. చికెన్ ధరలు(Chicken Prices) తగ్గుముఖం పట్టాయి. కేజీ చికెన్ 250 నుంచి 300 వరకు ఉండగా, ఇప్పుడు కేజీ కోడి మాంసం ధర రూ.80కు చేరింది. మరోవైపు కూరగాయల ధరలు(Vegtabels price) అమాంతం పెరిగిపోయాయి.
ఉత్తరాదిన శివమాలధారణలు, దక్షిణాదిన అయ్యప్ప మాలధారణలు వేసుకుని భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోతున్నారు. దీంతో డిసెంబర్ ముగిసే వరకూ మాంసం విక్రయాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. వినియోగం తగ్గడంతో చికెన్ ధర కూడా అమాంతం పడిపోయింది.
చికెన్ ధరలు అకస్మాత్తుగా తగ్గిపోవడంతో పౌల్ట్రీ రైతులకు తీరని నష్టం వాటిల్లుతోంది. కరోనా తర్వాత చికెన్ వాడకం భారీగా పెరిగినా సుమారు మూడేళ్ల తర్వాత చికెన్ ధరలు భారీగా తగ్గడంతో వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. ఓ వైపు మాంసం వాడకం తగ్గితే మరో వైపు కూరగాయల వాడకం పెరిగింది. దీంతో కూరగాయలకు డిమాండ్ ఉండడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
టమాటా, బీరకాయ, బెండకాయతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. దళారీల మాయాజాలం ధరల పెరుగుదలకు మరో కారణంగా తెలుస్తోంది. దీంతో విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎవరైనా కూరగాయలను కృత్రిమ ధరలు పెంచేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.