ఉత్తర కొరియా (North Korea) దూకుడు మీద ఉంది. వరుసగా క్షిపణి ప్రయోగాలతో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా సముద్ర గర్భంలో అణుదాడి (Nuclear Attack) చేయగల డ్రోన్‌ను రూపొందించినట్టు వెల్లడించింది. ఇటీవల దక్షిణ కొరియాతో అగ్రరాజ్యం అమెరికా, జపాన్‌ల సంయుక్త సైనిక విన్యాసాలకు ప్రతిస్పందనగా ఈ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టినట్టు పేర్కొంది.
ఇటీవల దక్షిణ కొరియాతో శాంతియుతమైన ఏకీకరణ కావాలన్న తమ దీర్ఘకాలిక లక్ష్యాన్ని రద్దు చేస్తున్నామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వెల్లడించారు. ఆ దేశంతో చేసుకున్న ఒప్పందాలను అన్నింటినీ రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు రాజ్యాంగ సవరణ కూడా చేయాలని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగం చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజాగా ప్రయోగించిన ఈ క్షిపణి సముద్ర గర్బంలో శత్రువుల కదలికలను పసిగట్టి దాడులు చేస్తుందని ఉత్తరకొరియా వెల్లడించింది. అమెరికా, దాని మిత్రదేశాల నౌకాదళ విన్యాసాలను అడ్డుకునేందుకు గాను తమ ప్రతిచర్యలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఇటీవల ఉత్తర కొరియా తన అణ్యాయుధ సామర్థ్యాన్ని భారీ స్థాయిలో విస్తరిస్తోంది.
గతేడాది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన డ్రోన్‌ను ఉత్తర కొరియా పరీక్షించింది. ‘హెయిల్’ పేరుతో గతేడాది మార్చి నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రత్యర్థుల నౌకలు, ఓడరేవులను టార్గెట్ చేసుకుని ఈ డ్రోన్లు తీరం నుంచి కూడా ప్రయోగించవచ్చని ఉత్తరకొరియా సైనిక వర్గాలు చెబుతున్నాయి.