ఉత్తర కొరియా (North Korea) సంచలన విషయాలు వెల్లడించింది. ఇటీవల తమ దేశానికి చెందిన ఓ నిఘా శాటిలైట్ అమెరికా (USA)లోని కీలక ప్రాంతాల ఫోటోలను చిత్రించిందని తెలిపింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ (White House),పెంటగాన్ (Pentagon), నౌకాదళం కేంద్రాలకు సంబంధించిన ఫోటోలను నిఘా శాటిలైట్ తీసినట్టు పేర్కొంది.
ఉత్తర కొరియా గత వారం ఓ నిఘా శాటిలైట్‌ను విజయవంతంగా లాంఛ్ చేసింది. అమెరికా, దక్షిణ కొరియాలోని మిలటరీ కార్యకలాపాలపై నిఘా కోసం ఈ శాటిలైట్ ను ప్రయోగించినట్టు ఉత్తర కొరియా వర్గాలు చెబుతున్నాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్, యూఎస్ సైనిక స్థావరాలతో సహా టార్గెట్ చేసిన పలు ప్రాంతాల చిత్రాలను శాటిలైట్ పంపించిందన్నాయి.
అమెరికా కేంద్రాలకు చెందిన ఈ శాటిలైట్ ఫోటోలను తమ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కూడా పరిశీలించినట్టు వెల్లడించా యి. రోమ్ నగరం, అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్, పెరల్ హార్బర్, కార్ల్ విన్సన్ ఎయిర్‌క్రాఫ్ట్ కేరీర్‌కు చెందిన ఫోటోలను కిమ్ పరిశీలించారని పేర్కొన్నాయి. శాటిలైట్ ఫైన్ ట్యూనింగ్ జరుగుతున్నట్లు వివరించింది.
ఇది ఇలా వుంటే ఉత్తర కొరియా శాటిలైట్ ప్రయోగాన్ని అమెరికా, దక్షిణ కొరియా ఖండించాయి. ఇది బాలిస్టిక్ టెక్నాలజీని ఉపయోగాన్ని నిషేధించే యూఎన్ భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడమే అవుతుందని మండిపడ్డాయి. అదే సమయంలో ఉత్తర కొరియా శాటిలైట్ సామర్థ్యంపై దక్షిణ కొరియా సందేహాలు వ్యక్తం చేసింది. శాటిలైట్ గురించి గానీ, అది తీసిన చిత్రాలను గానీ ప్రపంచానికి ఉత్తర కొరియా చూపించలేదని తెలిపింది.