సియాటెల్ లో పెట్రోలింగ్ వాహనం ఢీ కొని మరణించిన ఏపీ విద్యార్థిని జాహ్నవి కందుల విషయంలో నార్త్ ఈస్ట్రన్ యూనివర్శిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మరణాంతరం ఆమెకు డిగ్రీ ఇవ్వాలని వర్శిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఆమె తల్లిదండ్రులకు డిగ్రీ పట్టా అందజేయనున్నట్టు వర్శిటీ ఛాన్స్ లర్ వెల్లడించారు. జాహ్నవి మరణ వార్త తనను కలిచి వేసిందన్నారు.
నార్త్ ఈస్టర్న్ వర్శిటీ క్యాంపస్ లోని విద్యార్థులందరిపై జాహ్నవి మరణం తీవ్ర ప్రభావాన్ని చూపిందన్నారు. అత్యంత కఠినమైన ఈ సమయంలో విద్యార్థులకు తాము మద్దతుగా వుంటామన్నారు. జాహ్నవి మృతి కేసులో దర్యాప్తు జరుగుతోందన్నారు. ఆ ఘటనకు కారణమైన వారిని చట్ట పరంగా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని తాము భావిస్తున్నామని వెల్లడించారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల ఉన్నత విద్యాభ్యాసం కోసం 2021లో అమెరికాకు వెళ్లారు. అక్కడ ఈస్టర్న్ వర్శిటీలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. ఈ ఏడాది జనవరిలో అక్కడ రోడ్డు దాటుుతున్న సమయంలో వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం ఒకటి ఆమెను ఢీ కొట్టింది. దీంతో ఆమె మరణించారు.
ఆ వాహనాన్ని కెవిన్ డేవ్ అనే పోలీసు అధికారి నడిపినట్టు సియాటెల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. ఆ సమయంలో పెట్రోలింగ్ వాహనం గంటకు 119 కిలో మీటర్ల వేగంతో దూసుకు వచ్చిందని పేర్కొంది. వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో జాహ్నవి సుమారు 100 అడుగుల దూరంలో ఎగిరి పడిందని కథనంలో తెలిపింది. ఆమె మృతిపై దర్యాప్తు జరుగుతోంది.