ఐపీఎస్ (IPS) సీవీ ఆనంద్ (CV Anand) సంచలన ట్వీట్ చేశారు. అవినీతి జాబితాలో మరో కొత్త శాఖ వచ్చి చేరిందంటూ ట్వీట్లో తెలిపారు. ఈ ట్వీట్‌పై ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో అత్యంత అవినీతి గల శాఖల్లో ఎక్సైజ్ శాఖ కూడా వచ్చి చేరిందని ట్వీట్లో సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
ఇటీవల కల్లు గీత కార్మికులకు లైసెన్సులు జారీ చేసేందుకు లంచం తీసుకుంటూ జడ్చర్ల ఎక్సైజ్ సీఐ రాత్ నావత్ బాలోజీ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రమేశ్ వైట్ల అనే జర్నలిస్టు ఏసీబీ రాకింగ్ అంటూ ట్వీట్ చేశారు. దానికి ఐపీఎస్ సీవీ ఆనంద్ ను ట్యాగ్ చేశారు.
ఆ ట్వీట్ కు బదులిస్తూ… రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖలతోపాటు తాజాగా ఎక్సైజ్ శాఖ కూడా అత్యధిక అవినీతి గల డిపార్ట్ మెంట్ ల జాబితాలో చేరిందని వెల్లడించారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిపోయిందంటూ సామాన్య జనం, విపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటారు.
కానీ ప్రభుత్వ శాఖల్లో అవినీతి నెలకొందని ఓ ప్రభుత్వ ఉద్యోగి, అదీ ఓ డీజీపీ స్థాయి అధికారి ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ట్వీట్ పై నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ఆ శాఖలు మాత్రమే కాదని అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ అవినీతి పేరుకు పోయిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.