వన్డే ప్రపంచకప్‌లో(ODI World Cup 2023) వరుస విజయాలతో టీమ్ ఇండియా దూసుకెళ్తోంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో వరుసగా నాలుగో గెలుపు నమోదు చేసింది భారత్. టీమిండియా ఆదివారం (అక్టోబర్ 22న) కీలకమైన మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు కాస్త బ్రేక్ వచ్చింది. మూడు రోజులు ఇంటికి వెళ్లేందుకు బీసీసీఐ అనుమతించినట్లు సమాచారం.
హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో భారత్ (IND vs NZ) తలపడనుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో అక్టోబర్ 29న టీమిండియా (INDvs ENG) ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు మధ్య వారం రోజుల గ్యాప్ వస్తోంది. ఈ క్రమంలో టీమిండియా ప్లేయర్లకు కాస్త ఊరట లభించింది. వారం రోజుల సమయం ఉండడంతో బీసీసీఐ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంతోపాటు ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం.
‘కివీస్‌తో మ్యాచ్ అనంతరం భారత్ ఆడాల్సిన తదుపరి మ్యాచ్ వారం రోజులపాటు వ్యవధి ఉంది. దీంతో టీమిండియా ఆటగాళ్లను ఓ రెండు లేదా మూడురోజులపాటు ఇంటికి పంపించాలనే ఆలోచనలో ఉన్నాం. మళ్లీ ఫుల్ జోష్‌తో తిరిగి బరిలోకి దిగేందుకు అవకాశం ఉంటుంది’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇంటికి వెళ్లి వచ్చిన వెంటనే ప్రాక్టీస్ సెషన్‌ను ఏర్పాటు చేసి మళ్లీ క్రికెట్ మూడ్‌లోకి వచ్చేలా చేయాలనేది బీసీసీఐ యోచిస్తున్నట్లుగా అర్థమవుతోంది.
లీగ్ స్టేజ్‌లో తొమ్మిది మ్యాచ్‌ను తొమ్మిది సిటీల్లోని మైదానాల్లో ఆడే ఏకైక జట్టు భారత్ కావడం విశేషం. గత ఆసియా కప్ నుంచి భారత క్రికెటర్లు తీరికలేని బిజీ షెడ్యూల్ గడిపేస్తున్నారు. దీంతో ఇంగ్లాండ్ మ్యాచ్‌కు రెండు రోజుల ముందు ఆటగాళ్లంతా లక్నోకు చేరుకొని ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉన్నాయి.