సీనియర్ జర్నలిస్టు, రచయిత సాగరిక ఘోష్ (Sagarika Ghosh)ను రాజ్యసభ అభ్యర్థిగా టీఎంసీ (TMC) నామినెట్ చేసింది. ఈ నెల 27న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆమె టీఎంసీ తరఫున పోటీ చేయనున్నారు. తనను రాజ్య సభ అభ్యర్థిగా టీఎంసీ ఎంపిక చేయడంపై సాగరిక ఘోష్ స్పందించారు. పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ధైర్యాన్ని చూసి తాను స్పూర్తి పొందానని వెల్లడించారు.
‘టీఎంసీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయినందుకు నేను సంతోషిస్తున్నాను. దీన్ని గౌరవంగా భావిస్తున్నాను. దేశంలో ప్రస్తుత ఏకైక మహిళా ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ ధైర్యసాహసాల నుంచి నేను స్ఫూర్తి పొందుతున్నాను. రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువల పట్ల నా నిబద్ధత ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది’అని సాగరిక ఘోష్ ట్వీట్ చేశారు.
ఇది ఇలా వుంటే గతంలో సాగరిక ఘోష్ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. గతంలో ఆమె జర్నలిస్టులు, ఐఎంహెచ్ఓ రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. జర్నలిస్టులు ఏ పార్టీకి విధేయత చూపరాదు అని అన్నారు. స్వాతంత్ర్యంతో రాజీపడటం అనేది జర్నలిస్తులు తమకు తాముగా చేసుకోగలిగే చెత్త పని అని మండిపడ్డారు. పౌర సమాజాన్ని, ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం, న్యాయం కోసం పని చేద్దామని పిలుపు నిచ్చారు.
అంతకు ముందు మరో ట్వీట్లో తాను ఏ రాజకీయ పార్టీ నుంచి ఎలాంటి రాజ్యసభ (ఆర్ఎస్) టికెట్ కానీ, పీఎస్ టికెట్ కానీ, సీఎస్ టికెట్ కానీ అంగీకరించబోనని అన్నారు. ఈ విషయాన్ని బాండ్ కాగితంపై రాసిస్తానన్నారు. కావాలంటే ఈ ట్వీట్ ను స్క్రీన్ షాట్ చేసి సేవ్ చేసుకొండి అని తెలిపారు. ఇప్పుడ ఆ ట్వీట్ లను షేర్ చేస్తూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఆ మాటలు మరచి పోయారా… అని ప్రశ్నిస్తున్నారు. చెప్పేదొకటి చేసే దొకటి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.