Telugu News » BRS : కంట్రోల్ తప్పుతున్న కారు.. ఒక్కొక్కరుగా జంప్..!

BRS : కంట్రోల్ తప్పుతున్న కారు.. ఒక్కొక్కరుగా జంప్..!

బీఆర్ఎస్ లో చాలామంది నేతలు అసంతృప్తిలో ఉన్నారు. ఎంపీ టికెట్ కోసం కొందరు ఎదురుచూస్తున్నారు. హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఇనగాల పెద్దిరెడ్డి త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్టు సమాచారం.

by admin
brs

– బీఆర్ఎస్ కు వరుస షాకులు
– పార్టీని వీడుతున్న నేతలు
– మాజీ ఎమ్మెల్యే రాజయ్య రాజీనామా
– లేఖలో మూడు ముక్కలతో గుడ్ బై
– త్వరలో కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రచారం
– రాజయ్య బాటలో ఉన్న నేతలెవరు..?
– ఇద్దరు ఎంపీల తీరుపై అనుమానాలు
– ఎమ్మెల్యేలు, మాజీల పక్క చూపులు
– టికెట్ దక్కకపోతే రాజీనామాలకు రెడీ
– రేవంత్ తో మేయర్ విజయలక్ష్మి భేటీ
– నిజంగా, బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అవుతుందా..?

ఉద్యమ పార్టీగా ముద్ర. ప్రత్యేక తెలంగాణను రెండు పర్యాయాలు పాలించిన రికార్డ్. కానీ, అసెంబ్లీ ఎన్నికల ఓటమితో సీన్ రివర్స్ అయిపోయింది. మెల్లమెల్లగా బీఆర్ఎస్ (BRS) ఖాళీ అవుతోంది. ఇప్పటికే కొందరు నేతలు కేసీఆర్ (KCR) కు గుడ్ బై చెప్పగా.. తాజాగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Rajaiah) పార్టీని వీడారు. వరంగల్ ఎంపీ సీటుపై అధిష్టానం స్పందించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపారు. కేసీఆర్ గారికి నమస్తే.. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అంటూ మూడు ముక్కల్లో లేఖను ముగించారు రాజయ్య.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ టికెట్ రాజయ్యకు కాకుండా కడియం శ్రీహరికి కేటాయించింది బీఆర్ఎస్ అధిష్టానం. అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. తర్వాత రాజయ్యకు రైతుబంధు ఛైర్మన్ పదవి ఇచ్చినా ఆయన సంతృప్తిగా లేరు. వరంగల్ ఎంపీ టికెట్ ఆశించారు. అయితే కేసీఆర్ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నానని తనకు గుర్తింపు లేదని రాజయ్య తెలిపారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ నాయకులు అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన పోరాటం చేయలేమా అని ప్రశ్నించారు. తన మద్దతు దారులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

రాజయ్య ఇటీవల వరంగల్ ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం రాజయ్య చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ ఎంపీ టికెట్ రాజయ్యకు కేటాయించే అవకాశముందని సమాచారం. ఆ హామీతోనే ఆయన పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు రాజయ్య దారిలో ఇంకెంతమంది నడుస్తారనేది ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.

బీఆర్ఎస్ లో చాలామంది నేతలు అసంతృప్తిలో ఉన్నారు. ఎంపీ టికెట్ కోసం కొందరు ఎదురుచూస్తున్నారు. హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఇనగాల పెద్దిరెడ్డి త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్టు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో ఈయన కౌశిక్ రెడ్డి గెలుపు కోసం పనిచేశారు. కానీ, పార్టీ నుంచి రావాల్సిన సపోర్ట్ అయితే ఉండడం లేదనే అసంతృప్తిలో ఉన్నారని.. త్వరలో హస్తం గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇటు దక్షిణ తెలంగాణకు చెందిన ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి.

నాగర్ కర్నూల్ ఎంపీ రాములు మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. కానీ, ఈసారి గువ్వల బాలరాజుకు టికెట్ దక్కొచ్చని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే రాములు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. అలాగే, మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూడా అధిష్టానం తీరుపై అసహనంలో ఉన్నారు. గత ఎన్నికల్లో మాలోత్ కవితకు టికెట్ ఇవ్వగా.. ఈసారి ఆయనకు దక్కకపోతే కేసీఆర్ కు బైబై చెప్తారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తీరుపైనా అనుమానాలున్నాయి. అలాగే, జీహెచ్ఎంసీ పరిధిలో చాలామంది కార్పొరేటర్లు పార్టీ మారేందుకు చూస్తున్నట్టుగా సమాచారం. ఈ ప్రచారం జరుగుతున్న సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డితో మేయర్ విజయలక్ష్మి కలవడం చర్చనీయాంశమైంది. ఆమె కూడా పార్టీ మారుతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, అభివృద్ధి పైనే రేవంత్ తో చర్చించినట్టు చెప్పారు. మొత్తంగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కు వరుస షాకులు తప్పేలా లేవని అంటున్నారు రాజకీయ పండితులు.

You may also like

Leave a Comment