దేశంలో జమిలీ ఎన్నికల ప్రతిపాదనను కాంగ్రెస్ (Congress)మరోసారి వ్యతిరేకించింది. ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’అనే భావనను తాము వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ జాతీయ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తెలిపారు. ఇది ప్రజాస్వామ్య ఆలోచనకు విరుద్దమని, రాజ్యాంగంలోని సమాఖ్య హామీలకు వ్యతిరేఖమని తెలిపారు. ఈ మేరకు ఒకే దేశం-ఒకే ఎన్నికలపై ఏర్పాటు చేసిన కమిటీ సెక్రటరికీ ఆయన లేఖ రాశారు.
దేశంలో పటిష్ఠమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించేందుకు ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనే ఆలోచనను పక్కన పెట్టాలని సూచించారు. అందుకోసం ఏర్పాటు చేసిన కమిటీని కూడా రద్దు చేయాలని కోరారు. రాజ్యాంగాన్ని పూర్గిగా తారుమారు చేసేందుకు మోడీ సర్కార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా మాజీ రాష్ట్రపతి సేవలను ఇందుకోసం వాడుకుంటోందన్నారు.
అందువల్ల ఈ చర్యను ఒకే దేశం-ఒకే ఎన్నిక ప్యానెల్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని కోరారు. కమిటీ తీరు చూస్తే ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా ఉందని, ఏదో కంటి తుడుపు చర్యగా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా అనిపిస్తోందని ఆయన అన్నారు.
కోవింద్ కమిటీ చేస్తున్న వ్యాఖ్యలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో వారు నిజాయితీతో వ్యవహరించాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే కాకుండా ప్రజల ఆలోచనలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం, పార్లమెంట్, కేంద్ర ఎన్నికల సంఘంపై ఉన్నాయని తెలిపారు. ఇలాంటి ఎన్నికలకు ప్రభుత్వం పోవడం రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రజల పక్షాన, కాంగ్రెస్ తరఫున కమిటీ ప్యానెల్‌కు తాను ఈ మేరకు అభ్యర్థిస్తున్నానన్నారు.