ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో సాధారణ, మధ్యతరగతి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాటికి ఉల్లిగడ్డ(Onion Prices)తోడై కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది. పెరుగుతున్న ధరలతో వంటింట్లో పొయ్యి వెలిగించాలంటే ఆలోచించే పరిస్థితి నెలకొంది. మొన్నటిదాగా కిలో రూ.20-30 పలికిన కిలో ఉల్లిగడ్డ ధర ఢిల్లీలో (Delhi) ఇప్పుడు ఏకంగా రూ.80కి ఎగబాకింది.
ఇవాళ ఐదు కిలోలకు రూ.350కి చేరిందని ఘాజీపూర్ కూరగాయల మార్కెట్లోని (Ghazipur vegetable market) ఓ ఉల్లిగడ్డ వ్యాపారి (Onion trader) తెలిపాడు. గురువారం అదే ఐదు కిలోలు రూ.300, బుధవారం రూ.200గా ఉండేదని తెలిపారు. వారం రోజులుగా ఉల్లిగడ్డ ధరలు పెరుగుతూ వస్తున్నాయని చెప్పారు. ఉత్పత్తి తక్కువగా ఉండటమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
రానున్న రోజుల్లో ఉల్లిగడ్డల ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నవరాత్రి ముందు రూ.50గా ఉన్న కిలో ఉల్లిగడ్డ ధర ఇప్పుడు రూ.70 చేరింది. తమకే రూ.70కి పడుతుండటంతో వినియోగదారులకు రూ.80కి అమ్ముతున్నామని వ్యాపారులు చెప్తున్నారు. గతంలో కిలోకు రూ.30 నుంచి 40 మధ్య ఉందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే కిలో రూ.100కు చేరుతుందంటున్నారు.
ఉల్లిగడ్డతోపాటు టమాట (Tomatoes) ధరలు కూడా పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. గతంలో కిలోకు రూ.20గా ఉన్న టమాట.. ప్రస్తుతం రూ.40 నుంచి 45 పలుకుతోంది. ఇలాగే పెరుగుతూపోతే రూ.70 వరకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.