కర్ణాటక (Karnataka)లో ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన ఐదు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ (Dk Shiva Kumar) అన్నారు. కానీ ఈ పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా బీఆర్ఎస్ సర్కార్ నెరవేర్చిందా అని ఆయన ప్రశ్నించారు. తాము ఇచ్చిన గ్యారెంటీలను అప్పుడే అమలు చేశామని అనుమానం ఉంటే కేసీఆర్ అక్కడకు వచ్చి చూసుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ విజయ భేరి రెండో విడత బస్సు యాత్రను వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి ఆ పార్టీ శనివారం ప్రారంభించింది. ఈ బస్సు యాత్రకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేదల గురించి ఆలోచిస్తుందని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రజలపై ప్రేమతోనే ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పట్ల కృతజ్ఞత చూపాలని కోరారు. కాంగ్రెస్ ఏదైనా హామీ ఇచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతుందన్నారు. రైతు భరోసా కింద రాష్ట్రంలో రైతులకు ఎకరాకు రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పారు. వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని అన్నారు.
యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షలు ఇస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంటి స్థలం లేని పేదలకు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. డిసెంబరు 3 తర్వాత కేసీఆర్ కుటుంబం రెస్టు తీసుకోవాల్సిందేనన్నారు. డిసెంబరు 9న రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడుతుందన్నారు. డిసెంబరు 10 నుంచే 6 గ్యారెంటీలను కాంగ్రెస్ అమలు చేస్తుందని స్పష్టం చేశారు.
కర్ణాటకలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. అలాగే గృహలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2 వేలు ఇస్తున్నామన్నారు. తాము ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో పేదలకు 10 కిలోల సన్న బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నామన్నారు. కర్ణాటకలో మహిళలంతా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు.
అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. కేసీఆర్ తన ఓటమిని అచ్చం పేటలో ముందే ఒప్పుకున్నారని అన్నారు. కాంగ్రెస్ విజయం ఖాయమని కేసీఆర్కు ముందే తెలుసన్నారు. అందుకే విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు. ఐదేళ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కార్ రుణమాఫీ చేయలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.