ఇజ్రాయెల్ (Israel) లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్ అజయ్ (Operation Ajay) కొనసాగుతోంది. తాజాగా 286 మందితో కూడిన స్పైస్ జెట్ (Spice Jet) విమానం టెల్ అవీవ్ నుంచి బయలు దేరి ఢిల్లీ చేరుకుంది. ఇందులో 18 మంది నేపాలీలు కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
ఇది ఆపరేషన్ అజయ్ కింద పంపిన ఐదవ విమానం కావడం గమనార్హం. ఢిల్లీ విమానాశ్రయంలొ దిగిన ప్రయాణికులకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలను విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేశారు.
ఈ విమానంలో తమ రాష్ట్రానికి చెందిన 22 మంది ఉన్నట్టు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. ఇది ఇలా వుంటే స్పైస్ జెట్ విమానం నిన్న టెల్ అవీవ్ ల్యాండ్ అయింది. ఆ కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో విమానాన్ని జోర్డాన్ కు తరలించి విమానంలో సమస్యను పరిష్కరించారు.
అనంతరం మళ్లీ విమానాన్ని టెల్ అవీవ్ ల్యాండ్ చేశారు. షెడ్యూల్ ప్రకారం విమానం సోమవారమే భారత్ చేరుకోవాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఈ రోజు ఉదయం భారత్ కు చేరుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో దిగిన తర్వాత భారత పౌరులు భావోద్వేగానికి గురయ్యారు.