– తెలంగాణలో నిధుల పంచాయితీ
– కామారెడ్డిలోని గుళ్లకు..
– యాదాద్రి, వేములవాడ ఆలయాల నగదు
– ప్రభుత్వ తీరును తప్పుబడుతున్న ప్రతిపక్షాలు
– కేసీఆర్ పోటీ చేస్తున్నారనే అభివృద్ధి
– ఇతర ఆలయాల నిధుల్ని ఎలా వాడతారు?
– నిజాం, రజాకార్ల తీరుగా కేసీఆర్ నిర్ణయాలు
– ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ అంటూ చమత్కరించిన బండి
రానున్న ఎన్నికలు కేసీఆర్ (KCR) కు ఎంతో ప్రత్యేకం. ఇంతవరకు సౌత్ లో ఏ సీఎం మూడోసారి వరుసగా అధికారంలోకి వచ్చింది లేదు. కానీ, ముచ్చటగా మూడోసారి గెలిచి రికార్డ్ క్రియేట్ చేయాలనేది కేసీఆర్ ప్లాన్. పైగా, ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్ లో తిరుగుబాటు మొదలవ్వడం వల్లే కామారెడ్డి (Kamareddy) ని ప్లాన్ బీ గా కేసీఆర్ పెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి. అయినా, ఆయన వెనక్కి తగ్గకుండా తన వ్యూహాల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే కామారెడ్డి అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. అయితే.. ఆలయాల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయడం వివాదాస్పదం అవుతోంది.
కేసీఆర్ పోటీ చేయబోతున్న కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు ఆలయాల అభివృద్ధి కోసం యాదాద్రి, వేములవాడ దేవస్థానాలకు చెందిన రూ.10 కోట్ల నిధులను ఇవ్వాలని దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చెరో రూ.5 కోట్లు ఇవ్వాలని రెండు ఆలయాల ఈవోలకు ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ ఆదేశాలిచ్చారు. అయితే.. ఈ ఉత్తర్వులపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ నిరసనలకు దిగుతున్నారు నేతలు. కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు.
రాజన్న సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్.. ఇప్పుడు ఆ దేవుడికే శఠగోపం పెట్టాలని చూస్తున్నారని మండిపడుతున్నారు విపక్ష నేతలు. వెంటనే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనిపై బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ (Bandi Sanjay) ట్విట్టర్(ఎక్స్)లో స్పందించారు. నిజాం, రజాకార్లు దేవాలయాలను దోచుకున్నట్లుగా.. ఈ నయా నిజాం కాసీం చంద్రశేఖర్ రిజ్వీ తీరు ఉందని మండిపడ్డారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారని, కాబట్టి ఇతర నియోజకవర్గాల నుంచి ఆలయ సొమ్మును అక్కడకు మళ్లించాలని అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు బీజేపీపై చేసే వ్యాఖ్యలను తిప్పికొట్టారు బండి. ఇలాంటి వారు సిగ్గులేకుండా తమని కమ్యూనల్ అంటారని విమర్శించారు. కామారెడ్డి ఓటర్లు జాగ్రత్త ఉండాలన్న ఆయన.. కేసీఆర్ ఆలయ పునరుద్ధరణపై తప్పుడు వాగ్దానాలు మాత్రమే చేస్తారని, ఆ ట్రాప్ లో పడొద్దని సూచించారు. ఈ సందర్భంగా గతంలో కేసీఆర్ ఆలయాల అభివృద్ధిపై చేసిన వాగ్ధానాలను గుర్తు చేశారు.
ఈ ఆలయాల అభివృద్ధి ఏమైంది కేసీఆర్?
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం
వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయం
అలంపూర్ జోగులాంబ దేవాలయం
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం
బాసర సరస్వతి దేవాలయం
ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం