తిమ్మిని బమ్మిని చేయడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని విపక్షాలు తరచూ విమర్శలు చేస్తుంటాయి. ఎన్నికల సమయంలో ఆయన చేసే పనులు, తీసుకునే నిర్ణయాలే అందుకు నిదర్శనంగా చెబుతుంటాయి. ఇంకో నాలుగైదు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ గెలుపు వ్యూహాల్లో తలమునకలవ్వగా.. కేసీఆర్ వారి ఎత్తులకు పై ఎత్తులు వేసే పనిలో పడ్డారు. ఎలాగైనా, ఏ విధంగానైనా మూడోసారి గెలవాలని చూస్తున్నారు. అయితే.. కేసీఆర్ చర్యలను ఎన్నికల స్టంట్ గానే ప్రజలు భావించి తగిన బుద్ధి చెప్పాలని విపక్ష నేతలు కోరుతున్నారు.
చాలా రోజుల తర్వాత సుదీర్ఘ కేబినెట్ మీటింగ్ నిర్వహించారు కేసీఆర్. దాదాపు 50 అంశాలపై చర్చించారని వార్తలు వస్తున్నాయి. అయితే.. అన్నింటిలోనూ హైలైట్ అయిన అంశం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం. అవును, ఎన్నో ఏళ్లుగా కార్మికులు దీనికోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడిన ఈ సమయంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం కార్మికులపై ప్రేమ కాదని.. ముమ్మాటికీ ఇది ఎలక్షన్ డ్రామా అని విపక్ష నేతలు అంటున్నారు. కేసీఆర్ ట్రాప్ లో పడొద్దని సూచిస్తున్నారు.
తెలంగాణలో అతి పెద్ద వ్యవస్థగా ఉంది ఆర్టీసీ. ఇందులో పని చేసే ఉద్యోగులను సంతృప్తి పరిస్తే ప్రత్యక్షంగా వేల మంది, పరోక్షంగా వారిపై ఆధారపడిన లక్షల మంది బీఆర్ఎస్ వైపు మళ్లుతారనేది కేసీఆర్ ప్లాన్ గా చెబుతున్నారు ప్రతిపక్ష నేతలు. కేవలం ఓట్ల కోసమే ఎన్నికలు దగ్గర పడిన ఈ సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారని వివరిస్తున్నారు. కేసీఆర్ కు కార్మికులపై అంత చిత్తశుద్దే ఉంటే.. ఈ విలీనం ఎప్పుడో చేసేవారని అంటున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు తమను కూడా చేయాలంటూ ఇక్కడి ఉద్యోగులు పోరుకు దిగారు. ఆ సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఉద్యమంపై ఆయన చేసిన కన్నెర్ర ఎవరూ మర్చిపోరని గుర్తు చేస్తున్నారు విపక్ష నేతలు.
ఇప్పటికీ జీతాలు 15వ తేదీ దాటితే గానీ ఇవ్వడం లేదని.. కేసీఆర్ వల్ల ఎంతోమంది ఆర్టీసీ ఉద్యోగులు అప్పులపాలయ్యారని విమర్శిస్తున్నారు. మెట్రో పేరుతో నగరవాసుల ఓట్లకు గాలం వేసిన కేసీఆర్.. ఇప్పుడు విలీనం పేరుతో ఉద్యోగులతో డ్రామా చేస్తున్నారని అంటున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీకి లక్ష కోట్ల వరకు ఆస్తులున్నాయి. మరోసారి కేసీఆర్ ని గెలిపిస్తే.. ప్రభుత్వ భూములు వేలం వేసినట్టే.. ఆర్టీసీ ఆస్తులు కూడా మాయం చేస్తారని విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు.