ఎన్నికలలో పోటీ చేసే పలువురు అభ్యర్థులపై ఈసీకి ఇప్పటికే ఫిర్యాదులు అందుతున్న విషయం తెలిసిందే.. బరిలో ఉన్న పలువురు నేతలు తప్పుడు సమాచారాలు అందిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం అధికార పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman)పై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు అందింది.
ఎమ్మెల్యేకు పోలీసులు అనుకూలంగా పని చేస్తున్నారని ఉస్మానియా యూనివర్శిటీ (OU Student) జేఏసీ (JAC) విద్యార్థులు ఫిర్యాదు చేశారు.. చెన్నూరు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ విద్యార్థుల పట్ల.. స్థానిక పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ జటంగి సురేష్ యాదవ్ తమ ఫిర్యాదులో వివరించారు.
చెన్నూరు (Chennoor)లో ప్రచారానికి వెళ్లిన తమను పోలీసులు ఆపి.. ఆధార్ కార్డులు, పాన్ కార్డులు కావాలంటూ చాలా ఇబ్బందులకు గురి చేశారని.. అక్కడి పోలీసులు బాల్క సుమన్ ఆదేశాల ప్రకారం పని చేస్తున్నారని జేఏసీ విద్యార్థులు ఈసీకి ఫిర్యాదు చేశారు. అదీగాక బాల్క సుమన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే కేసులు పెడుతామని పోలీసులు బెదిరించినట్టు విద్యార్థులు పేర్కొన్నారు..
మరోవైపు ఓటర్లను ఆకట్టుకోవడానికి విపరీతంగా మద్యం పంచి పెడుతూ.. యువకుల జీవితాలను అధికార పార్టీ నేతలు నాశనం చేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. చెన్నూరులో జరుగుతున్న చర్యలపై వెంటనే విచారణ చేపట్టి.. డబ్బులు, మద్యం విచ్చలవిడిగా పంచుతున్న బాల్క సుమన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని వారు కోరారు.