ఈ ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ (KCR) హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) అన్నారు. గతంలో తాము వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మాత్రమే ఉన్నామని చెప్పారు. తాము కాంగ్రెస్ పార్టీతో లేమని స్పష్టం చేశారు. తెలంగాణ గాంధీ భవన్ రిమోట్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో ఉందని ఆయన ఆరోపించారు. నిజామాబాద్లో ఆర్ఎస్ఎస్ బలపడవద్దని అందుకే తాము అక్కడ పోటీ చేయడం లేదన్నారు.
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….. కాంగ్రెస్ వల్లే బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తోందని విమర్శలు గుప్పించారు. బీజేపీ గెలుపునకు ఎంఐఎంను కాంగ్రెస్ బాధ్యునిగా చెబుతోందని మండిపడ్డారు. ఆ పార్టీ విజయం సాధిస్తే తాను ఎలా బాధ్యుడిని అవుతానంటూ ప్రశ్నించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఆర్ఎస్సెస్తోనే ప్రారంభమైందన్నారు. అందుకే ఇప్పుడు గాంధీ భవన్ రిమోట్ మోహన్ భగవత్ చేతిలో ఉందని వివరించారు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా బీజేపీతో తమ పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు జూబ్లీహిల్స్లో బలమైన అభ్యర్థిని తమ పార్టీ బరిలోకి దించిందన్నారు. ఏడు స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు.
అజారుద్దీన్ ఓ మంచి క్రికెటర్ అని అన్నారు. కానీ ఆయన ఒక విఫల రాజకీయ నాయకుడు అని తెలిపారు. అసలు అజారుద్దీన్ను హెచ్ సీఏ ప్రెసిడెంట్గా చేసిందే కేటీఆర్ అని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గోపీనాథ్ ఏ మాత్రం పని చేయలేదన్నారు. అందుకే ప్రజలకు కనిపించకుండా పోయారంటూ మాగంటి గోపీనాథ్ పై విమర్శలు గుప్పించారు.