Pakistan : పాకిస్తాన్ లో ఆదివారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 33 మందికి పైగా మరణించారు. సుమారు 80 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. రావల్పిండి (Ravalpindi) కి వెళ్తున్న హజారా ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన 10 బోగీలు నవాబ్ షా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. గాయపడినవారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు.
బోగీల కింద కొందరు ప్రయాణికులు చిక్కుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని కూడా భయపడుతున్నారు. ఈ ఘోర ప్రమాదానికి కారణాలు తెలియలేదు. యాక్సిడెంట్ లో బోగీలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. బ్రేకులు వేయడంలో డ్రైవర్ జాప్యం చేసినందువల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
వెయ్యి మంది ఈ రైల్లో ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. శిథిలాల నుంచి బాధితులను బయటకు తీసేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి.
బహుశా సాంకేతిక లోపం వల్ల గానీ, విద్రోహ చర్య వల్ల గానీ ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని పాక్ రైల్వే శాఖ మంత్రి ఖ్వాజా సాద్ రఫీక్ (Khawaja Saad Rafiq ) పేర్కొన్నారు. ఈప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.