Telugu News » KCR: పిండం..ఎవరికి!? పెట్టేది ప్రజలే! 

KCR: పిండం..ఎవరికి!? పెట్టేది ప్రజలే! 

by umakanth rao
CM KCR

– హ్యాట్రిక్ పక్కాగా కొడతాం
– ఎవరికి పిండం పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారు
– కాంగ్రెస్ అలవి కానీ హామీలు ఇస్తోంది
– మేం అలాకాదు.. చేయగలిగేది చెప్తాం
– దేశం ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పేస్కేల్ పెంచుతాం
– త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తాం
– ఆర్థిక వనరులు సమకూరగానే మళ్లీ జీతాలు పెంచుతాం
– మా అమ్ములపొదిలో ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయి
– సింగరేణిని నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీయే
– రైతుల పంట మొత్తం కొంటున్న ఏకైక రాష్ట్రం మనదే
– ధరణి తీసేస్తాం అనే వారికి ఇంగితం ఉండాలి
– మజ్లీస్-బీఆర్ఎస్ ఎప్పటికీ ఫ్రెండ్లీ పార్టీలే
– అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, రాష్ట్ర:ధాన్యం దిగుమతిలో పంజాబ్ ను తెలంగాణ అధిగమిస్తోందని సీఎం కేసీఆర్(CM KCR) అన్నారు. ఇతర రాష్ట్రాల కన్నా ఈ విషయంలో మనమే ముందున్నామని ఆదివారం అసెంబ్లీలో మాట్లాడారు. తొమ్మిదేళ్లలో తెలంగాణ పురోగతిపై చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు రాష్ట్రంలో లారీలు సరిపోవడంలేదని, తొలి నాళ్ళలోనే 30-40 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించామని చెప్పారు. వరదల వల్ల నష్టపోయిన వారిని కాపాడుకుంటామన్నారు. అయితే.. కొన్నాళ్ల క్రితం వర్షాలు, వరదలకు గురైన రైతులు తడిసిపోయిన ధాన్యాన్ని రోడ్లపైనే వేసి తమ గోడు వినిపించుకున్నారు. మొలకలెత్తిన ధాన్యాన్ని ఎవరు కొంటారని వాపోయారు. తడిసిన ధాన్యాన్ని కొనేందుకు ముందుకు రావడం లేదని బావురుమన్నారు. మిల్లర్లు సిండికేట్ గా ఏర్పడి.. ధాన్యం కొనడానికి నిరాకరించడమే గాక.. నాలుగైదు కేజీలకు తక్కువ తూకం వచ్చేట్టు కొనాలని నిర్ణయించడంపై ఫైరయ్యారు. ఇంత జరిగినా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణలు ఉన్నాయి.

Telangana Assembly To Pass Resolution Opposing Centre's Power Reforms

అలవి కాని హామీలను మేం ఎప్పుడూ ఇవ్వం

గత ఏడాది భారీ వర్షాలు, వరదలకు భద్రాచలంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఆ ప్రాంతాన్ని సందర్శించిన కేసీఆర్.. బాధితులకు ఎన్నో హామీలిచ్చారు. వారికి పక్కా శాశ్వత గృహాలు నిర్మించి ఇస్తామని, ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా 10 వేల రూపాయల ఆర్ధిక సాయం చేస్తామని అన్నారు. ఈ జిల్లాకు వంద కోట్లను కేటాయిస్తామన్నారు. కానీ, ఈ హామీలన్నీ నీటిమీది బుడగలే అయ్యాయనే విమర్శలున్నాయి. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీలో వరద బాధితులను ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే, ‘‘రూ.4 వేలు పెన్షన్ పెంచుతామని కాంగ్రెస్ అంటోంది.. తాము రూ.5 వేలు పెంచుతామని అంటాం.. అలా చెప్పడం కాదు.. చేయాలి. అందుకే మేము సాధ్యం అయ్యేదే చెబుతాం.. చేస్తాం. పెన్షన్లు కచ్చితంగా పెంచుతాం.. కానీ, ఒకేసారి పెంచం. కాంగ్రెస్ అలవి కానీ హామీలు ఇస్తోంది. చేయగలిగేది చెప్పాలి.. అలా కాని పక్షంలో ప్రజలు నమ్మరు. మా అమ్ముల పొదిలో ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయి’’ అని అన్నారు సీఎం.

మళ్ళీ అధికారం మాదే

తెలంగాణలో మళ్ళీ అధికారం తమదేనని కేసీఆర్ చెప్పారు. తనకు పిండం పెడతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, కానీ వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండం పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ప్రభుత్వం తలచుకుంటే మీ తాట తీసేవాళ్లమేనని, కానీ తాము సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. తన చావు మీదకు తెచ్చుకుని తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. ఇదే సందర్భంలో దేశంలోనే 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పిన ఆయన.. ఎంత క్రమశిక్షణ పాటిస్తే 24 గంటల కరెంట్ సాధ్యమవుతుందని ప్రశ్నించారు. 25 వేల మెగావాట్ల విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ అవతరించబోతోందన్నారు. దళిత బంధు గురించి విపక్షాలు ఏనాడైనా ఆలోచించాయా అని కూడా కేసీఆర్ ప్రశ్నించారు. అయితే.. 24 గంటల ఉచిత కరెంట్ అంశంపై వివాదం కొనసాగుతోంది. అన్ని గంటలు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు సబ్ స్టేషన్లకు వెళ్లి లాగ్ బుక్స్ చెక్ చేసి చూపించారు.

You may also like

Leave a Comment