పాకిస్థాన్(Pakistan)లో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్న గ్రామంలో చేతిపంపు నుంచి నీటిని తాగిన చిన్నారులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. పాక్‌లోని సింధ్(Sindh) రాష్ట్రంలో గల సంఘర్ జిల్లా(Sanghar District)లో బోర్‌వెల్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు మురిద్ భట్టి (8), ముంతాజ్ (3), రషీద్ అలీ (5), సానియా (4), జమీరా (4) దాహం వేయడంతో దగ్గరలో ఉన్న చేతిపంపులోని నీళ్లు పట్టుకుని తాగారు. నీళ్లు తాగిన ఐదుగురికీ తీవ్ర జ్వరం రావడంతో పాటు విరేచనాలు, వాంతులు అయ్యాయి. దీంతో వారిని కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అయినప్పటికీ ఐదుగురు చిన్నారులు పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతిచెందారు. కలుషితమైన నీళ్లు తాగడం వల్లే చిన్నారులు మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బోరు నుంచి వచ్చిన నీళ్లు కలుషితమైనవని తెలియక చిన్నారులు తాగడంతో ప్రాణాలు విడిచారని తెలిపారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ కమిషనర్ ఆరోగ్య అధికారులతో కలిసి నీటిని పరీక్షించడానికి గ్రామాన్ని సందర్శించారు.
చేతిపంపు నుంచి వస్తున్న నీటిని పరీక్షల నిమిత్తం పంపించారు. నీటి పంపులో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు తేలడంతో జిల్లా ఆరోగ్యశాఖ అధికారి ముందు జాగ్రత్త చర్యగా వ్యవసాయ భూమిలో అమర్చిన చేతి పంపును మూసివేశారు. మృతిచెందిన చిన్నారుల కుటుంబానికి అండగా ఉంటామని సంఘర్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.