పాకిస్థాన్(Pakistan) ఆర్థిక పరిస్థితి పతనమవడంపై ప్రపంచ బ్యాంకు వేలెత్తి చూపించింది. పాకిస్థాన్ ఆర్థిక నమూనా విఫలమైందని ప్రపంచ బ్యాంకు(World Bank)స్పష్టంగా చెప్పింది. అక్కడి విధానాలు ధనికులను మరింత సంపన్నులను చేస్తుందే తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదని తెలిపారు. ఇప్పటికైనా మెరుగుపడకపోతే పేదరికం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.
కొంత మందికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధానాలను పాకిస్థాన్ మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రపంచ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ నాజీ బెన్ హాసిన్‌ను ఉటంకిస్తూ డాన్ వార్తాపత్రిక పేర్కొంది. విధానంలో మెరుగుదల అవసరం యూఎన్ఏపీ మ్యాగజైన్ డెవలప్‌మెంట్ అడ్వకేట్ బెన్హాసిన్ పాకిస్తాన్‌లో మాట్లాడుతూ.. వ్యవసాయం, విద్యుత్ రంగంలో పాకిస్తాన్ తన విధానాలను మెరుగుపరుచుకోవాలని ఆయన నొక్కిచెప్పారు.
వ్యవసాయంతో పాటు సంపన్నులపై గరిష్టంగా పన్నులు విధించి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరముందన్నారు. ముఖ్యంగా చిన్న పరిశ్రమలకు మెరుగైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా పాకిస్థాన్‌లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు.
పాకిస్థాన్ స్థిరమైన భవిష్యత్తు కోసం కలిసి రావాల్సిన సమయమిదని, పాకిస్తాన్‌లో పన్ను మినహాయింపులను వెంటనే తగ్గించాలని సలహా ఇచ్చారు. అధికారం ఉన్నవారు ప్రస్తుత సంక్షోభం సృష్టించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా.. అవసరమైనది చేస్తారా? అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న అని బెన్హాసిన్ అన్నారు.
పాకిస్తాన్ పేలవమైన ఆర్థిక నమూనా కారణంగా అది దాని తోటి దేశాల కంటే చాలా వెనుకబడి ఉందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో వ్యవసాయంలో అనేక లోటుపాట్లు, సబ్సిడీలు, మరెన్నో లోపాలను తొలగించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. తద్వారా దేశంలోని చిన్నకారు రైతులు లాభాలు పొందవచ్చని చెప్పారు. అదేవిధంగా ఎక్కువ మందిని వ్యవసాయంలోకి వచ్చేలా ప్రోత్సహించవచ్చన్నారు.