పాకిస్థాన్(Pakistan)లో ఉగ్రవాది నాత్ ఖవాన్ మౌలానా రహీముల్లా అలియాస్ మౌలానా రహీముల్లా తారిఖ్(Moulana Rahimulla Tharik)ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన కరాచీలో చోటుచేసుకుంది. మౌలానా మతపరమైన సమావేశానికి హాజరయ్యేందుకు బయల్దేరగా దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు.
దుండగులు అతనిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. రహీముల్లా తారిఖ్ హతమార్చడమే వారి లక్ష్యం కాదని కరాచీ పోలీసులు చెబుతున్నారు. మౌలానా రహీముల్లా జైషే మహ్మద్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్‌కు సన్నిహితుడని ప్రచారం జరుగుతోంది.
అయితే, మౌలానాకు జైష్ సంబంధంపై స్థానిక మీడియా కథనాలలో ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. ఇటీవల పాకిస్తాన్లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇదివరకు హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్ రావల్పిండిలో హత్యకు గురయ్యాడు. అతన్ని ఇంతియాజ్ ఆలం అని కూడా పిలుస్తారు. అయితే ఈ హత్యల వెనుక కారణాలు స్పష్టంగా తెలియరాలేదు.
మరో కేసులో ఖైబర్ పల్తున్వాలోని బజౌర్‌లో లష్క్-ఎ-తైబా సీనియర్ కమాండర్ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ్ ఖాన్ ఘాజీని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపేశారు. అతడు లష్కరే టెర్రరిస్టు ఆర్మీలో రిక్రూటర్‌గా పనిచేసినట్లు సమాచారం. ఈ విషయాలపై స్థానిక పోలీసులు కూడా కచ్చితమైన ప్రకటన ఇవ్వలేదు.
అదేవిధంగా తాజాగా జరిగిన మౌలానా రహీముల్లా తారిఖ్‌తో పాటు ఇది వరకు జరిగిన హత్యలకు ఏ సంస్థ బాధ్యత వహించలేదు. పాకిస్తాన్ తన సరిహద్దుల్లో కిడ్నాప్‌లు, హత్యలకు భారత నిఘా సంస్థలను బహిరంగంగా ఆరోపించడం గమనార్హం. భారత ఏజెన్సీ ఈ హత్యలకు పాల్పడుతోందని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పాకిస్థాన్ పేర్కొంది.