బిగ్‌బాస్-7 విన్నర్(Bigboss-7 Winner)గా నిలిచిన పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth)కు విజయోత్సాహం లేకుండా పోయింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలే ఇందుకు కారణం. అన్నపూర్ణ స్టూడియో వద్ద ర్యాలీ నిర్వహించొద్దని పోలీసులు వారించినా వినిపించుకోకపోవడం.. ప్రశాంత్ జైలుపాలు కావడానికి కారణంగా తెలుస్తోంది.
ఈ మేరకు జూబ్లిహిల్స్ పోలీసులు విధుల్లో ఉన్న తమకు ఆటంకం కలిగిందని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఈ మేరకు 41 సీఆర్పీసీ నోటీసును ప్రశాంత్‌కు అందజేశాకే అరెస్టు చేసినట్లు తెలిపారు. పల్లవి ప్రశాంత్ కారణంగా పలువురు యువకులు వికృత చేష్టలకు పాల్పడి.. పోలీసుల ముందే ఆరు ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారని వివరించారు.
పోలీసులను డ్యూటీ చేయకుండా పల్లవి ప్రశాంత్ అడ్డుకున్నారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఈ న్యూసెన్స్ మొత్తం పోలీసుల కళ్లముందే జరిగిందన్నారు. భవిష్యత్తులో వీరికి సమాజంపై బాధ్యత, భయం ఉండాలనే ఉద్దేశంతోనే అరెస్టు చేశామన్నారు పోలీసులు.
సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశమున్న కారణంగా పల్లవి ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మరో వైపు పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో విచారణ జరగనుంది. పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.