పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament budget session) ఈ నెల 31 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ సారి ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ ను ప్రవేశ పెట్టనుంది.
ఫిబ్రవరి 9 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని తెలుస్తోంది. మొదటి రోజున పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఈ బడ్జెట్లో మహిళా రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ బడ్జెట్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని రెట్టింపు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో కేంద్రంపై రూ. 12,000 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. సాధారణ పాలక ప్రభుత్వం ఎన్నికల సంవత్సరంలో లేదా పూర్తి బడ్జెట్‌కు తగినంత సమయం లేనప్పుడు మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పిస్తుంది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వం మొత్తం వార్షిక బడ్జెట్‌ను రూపొందిస్తుంది.
గత సంవత్సరాలకు భిన్నంగా ఈ ఏడాది సుదీర్ఘ ఆర్థిక సర్వేకు భిన్నంగా ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌కు ముందు 2024–25 సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై సంక్షిప్త నివేదికను ప్రభుత్వం సమర్పించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో స్మోక్ క్యాన్స్ తో దుండగులు అలజడి సృష్టించారు. ఈ నేపథ్యంలో ఈ సారి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.