పార్లమెంట్ ఎన్నికలకు (Parliament Elections) రంగం సిద్దం అయ్యింది. ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న ఎన్నికల సంఘం.. పోలింగ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టింది. మరోవైపు పార్లమెంటు ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
ఇక ఈ ఎన్నికల్లో విజయం కోసం తహతహలాడుతోన్న బీజేపీ (BJP).. జోరుగా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. ముఖ్యనేతలు సైతం రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.. ఈ సమయంలో కేంద్రానికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. వాట్సాప్ (Whatsapp)లో వికసిత్ భారత్ పేరుతో మెసేజ్లను తక్షణమే ఆపాలని నేడు ఐటీ మంత్రిత్వశాఖకు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ప్రధాని మోడీ (PM Modi) లేఖతో కూడిన ‘వికసిత భారత్ సంపర్క్’ వాట్సాప్ సందేశాన్ని లక్షలాది మంది భారతీయులు స్వీకరించారు. దీంతో వాట్సాప్ లో ‘వికసిత భారత్’ సందేశాలను ఆపివేయాలని ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందేశాలు ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే పంపామని, నెట్వర్క్ సమస్య వల్ల ఇప్పుడు వస్తున్నాయని కేంద్రం, ఈసీకి వివరణ ఇచ్చింది.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసే మెసేజ్లు వస్తున్నాయని ఈసీకి ఫిర్యాదులు అందాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. కోడ్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈ క్రమంలో ఈసీ ఈ చర్యలకు ఉపక్రమించిందని తెలుస్తోంది..