త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ (Congress) ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తోంది. వ్యూహాత్మకంగా నిర్ణయాలను అమలు చేస్తూ.. ఖచ్చితంగా గెలుపును అందుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పలు కీలక విషయాలు వెల్లడించారు..
కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని తెలిపిన ఆయన.. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నట్లు వెల్లడించారు.. ఇందులో భాగంగానే ఎంపీ అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు.. క్షేత్ర స్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చిందని తెలిపారు.. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని రేవంత్ అన్నారు..
కాగా అభ్యర్థులను ఎంపికలో చేవెళ్ల (Chevella), సికింద్రాబాద్ (Secunderabad), మల్కాజ్ గిరి (Malkajgiri) నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉందన్న సీఎం.. అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజిగిరి, సికింద్రాబాద్ దానం నాగేందర్ ని అభ్యర్థులుగా అధిష్టానం ప్రకటించిందని తెలిపారు.. అదీగాక మన వంద రోజుల పరిపాలనకు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు అనేది రెఫరెండం అని పేర్కొన్నారు..
అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు 14 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేసి కృతజ్ఞత చెబుదామన్నారు. మరోవైపు బీజేపీ పై కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి.. మోడీ పదేళ్లు ప్రధానిగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేయలేదు.. వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలు తీసుకురాలేదు. గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్లిన ప్రధానికి.. వికారాబాద్ కు ఎంఎంటీఎస్ రైలు తీసుకురావడం పెద్ద విషయం కాదని అన్నారు.
మరోవైపు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసుకొన్న మోడీ (Modi).. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు ఎందుకు ఇవ్వలేదో తెలుపాలన్నారు. అదీగాక కేంద్రం రీజనల్ రింగ్ రోడ్డు రాకుండా ఎందుకు మోకాలడ్డుతోందని ప్రశ్నించారు. ఏం చూసి మూడోసారి ఓటు వేసి బీజేపీని గెలిపించాలన్నారు.. మన రాష్ట్రం అభివృద్ధి చేసుకొనేందుకు ఇప్పుడు చక్కని అవకాశం వచ్చిందని పేర్కొన్న రేవంత్.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తేనే అది సాధ్యమని అన్నారు..
అదేవిధంగా తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు గ్యారంటీలను ప్రకటించుకున్నాం.. ఏప్రిల్ 6 లేదా 7 న మళ్లీ అక్కడే జాతీయస్థాయి గ్యారేంటీలను ప్రకటించుకోబోతున్నామని అన్నారు.. దేశ రాజకీయాలకు రంగారెడ్డి జిల్లా నుంచే శంఖారావం పూరించబోతున్నామని తెలిపిన సీఎం.. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఈ జనజాతర సభకు హాజరవుతారని వెల్లడించారు..