– జమిలి ఎన్నికలపై క్లారిటీ
– తెలంగాణలో స్పీడ్ పెంచిన పార్టీలు
– అసంతృప్తులను బుజ్జగిస్తున్న బీఆర్ఎస్
– కొత్త పథకాలపై కేసీఆర్ ఫోకస్
– అభ్యర్థుల ఎంపికతోపాటు..
– 6 గ్యారెంటీల ప్రచారంపై కాంగ్రెస్ దృష్టి
– జాతీయ నేతలను దింపుతున్న బీజేపీ
– అక్టోబర్ 2న రాష్ట్రానికి మోడీ
– ఆ వెంటనే అమిత్ షా, నడ్డా రాక
– రాష్ట్రంలో జోరందుకుంటున్న ఎన్నికల సందడి
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు అజెండా ఏంటో తెలియక విపక్ష పార్టీలు తలలు పట్టుకున్నాయి. ఈ క్రమంలోనే అనేక ఊహాగానాలు తెరపైకొచ్చాయి. ఇండియా పేరును భారత్ (Bharat) గా మారుస్తున్నారని, దేశమంతా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు (Jamili Elections) నిర్వహించాలని చూస్తున్నారని.. వీటికి సంబంధించిన బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందని అనేక అనుమానాలు, చర్చలు తెరపైకి వచ్చాయి. కానీ, కేంద్రం అనూహ్యంగా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది. ఉభయ సభలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. ఇంకే బిల్లుపై ప్రస్తావన లేకుండానే పార్లమెంట్ (Parliament) ఒకరోజు ముందుగానే నిరవధిక వాయిదా పడింది. అయితే.. జమిలి ప్రచారం నేపథ్యంలో తెలంగాణలోని పార్టీలు కాస్త నెమ్మదించగా.. ఇప్పుడు స్పీడందుకుంటున్నాయి.
షెడ్యూల్ ప్రకారం తెలంగాణ (Telangana) లో ఈ ఏడాది డిసెంబర్ కు ప్రస్తుత ప్రభుత్వ టైమ్ అయిపోతుంది. ఆలోపు ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అయితే.. ఇంకో మూడు నెలల తర్వాత సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా జమిలి బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుంది.. తెలంగాణలో ఎన్నికలు ఆలస్యమే.. లోక్ సభ ఎన్నికలతో కలిసే జరుగుతాయి.. ఇలా ఎన్నో ప్రచారాలు జరిగాయి. కానీ, జమిలి బిల్లు ప్రస్తావనే లేకుండా సమావేశాలు ముగిశాయి. అంటే, తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయనే క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) అభ్యర్థుల ఎంపిక, పథకాల రూపకల్పన, పార్టీ బలోపేతం, ప్రచారంలో జోరు పెంచాయి.
జమిలి ఎన్నిక కేవలం ప్రచారం మాత్రమే అని తేలిపోవడంతో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. ఓవైపు అసంతృప్త నేతలతో వరుసగా భేటీలు అవుతున్నారు. విభేదాలు, గొడవలు జరుగుతున్న నియోజకవర్గాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన ఆయన.. అన్నీ సెట్ రైట్ చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే రాజయ్య, కడియం మధ్య సయోధ్య కుదిర్చారు. అలాగే, పల్లాకు లైన్ క్లియర్ చేస్తూ.. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని చల్లబర్చారు. అలాగే, మిగిలిన నియోజకర్గాల్లో అసంతృప్త నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇటు, కొత్త పథకాలు, ప్రజాకర్షక అంశాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. త్వరలో పేదలకు గుడ్ న్యూస్ ఉంటుందని కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అంటే, మరిన్ని పథకాలను తెరపైకి తెస్తున్నారని అర్థం అవుతోంది.
ఇక, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో తలమునకలైంది. ఢిల్లీలో పలు దఫాలు భేటీ అయిన స్క్రీనింగ్ కమిటీ.. సగం సీట్లపై ఓ క్లారిటీకి వచ్చింది. మిగిలిన సీట్ల అంశాన్ని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి అప్పగించింది. అక్కడి ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ అవుతుంది. కర్ణాటకలో మాదిరిగా 6 గ్యారెంటీ హామీలను ప్రకటించిన కాంగ్రెస్ వాటిని జనంలోకి తీసుకెళ్లే అంశాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఇంటింటి ప్రచారం చేస్తోంది. గ్రామగ్రామాన ప్రతీ ఇంటి తలుపు తడుతున్నారు కాంగ్రెస్ నేతలు. 6 గ్యారెంటీల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే, త్వరలో బస్సు యాత్ర కూడా చేపట్టనుంది కాంగ్రెస్. అక్టోబర్ 2 నుంచి ఈ యాత్ర ఉంటుందని ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ జిల్లాకో సభ ఉండేలా ప్లాన్ చేస్తోంది.
మరోవైపు, బీజేపీ కూడా స్పీడ్ పెంచింది. ఏకంగా ప్రధాని మోడీనే రంగంలోకి దించుతోంది. అక్టోబర్ 2న మోడీ మహబూబ్ నగర్ కు రానున్నారు. దీనికి సంబంధించిన సమాచారం రాష్ట్ర నాయకత్వానికి అందింది. భారీ బహిరంగ సభలో పాల్గొని మోడీ ఎన్నికల శంఖారావాన్ని మోగించనున్నారు. ఇప్పటికే పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి అప్లికేషన్లు తీసుకున్న బీజేపీ.. వాటి వడబోతలో బిజీగా ఉంది. మోడీతోపాటు ఇంకొందరు జాతీయ నేతలను రాష్ట్రానికి పిలిపించి.. బహిరంగ సభలతో పాటు అభ్యర్థులను కూడా ప్రకటించడానికి రంగం సిద్ధం చేస్తోంది. మోడీ సభ తర్వాత రాష్ట్రంలో మరో రెండు ఉమ్మడి జిల్లాల్లో నడ్డా, అమిత్ షా సభలకు ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్ర నేతలు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను వివరిస్తూనే.. కీలక హామీలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఈసారికి జమిలి ఎన్నికలు ఉండవని క్లారిటీ రావడంతో పార్టీలన్నీ దూకుడు మీదున్నాయి.